ముగ్గురు కేంద్ర మంత్రులతో ఆర్థిక మంత్రి బుగ్గన భేటీ

Buggana meets three Union Ministers in Delhi - Sakshi

ఢిల్లీ పర్యటనలో మూడోరోజు పలు అంశాలపై చర్చ

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మూడో రోజైన బుధవారం పలువురు కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. ఆర్థికశాఖ కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ భావనా సక్సేనా ఆయన వెంట ఉన్నారు.  

వరి ఎగుమతికి సహకరించండి..
కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశం సందర్భంగా వరి సేకరణకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన రీయింబర్స్‌మెంట్‌ నిధులను విడుదల చేయాలని కోరారు. నివర్‌ తుపాన్‌ వల్ల రంగు కోల్పోయిన వరి ధాన్యం నాణ్యతలో సడలింపులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో సేకరించిన వరిని రైళ్ల ద్వారా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేలా సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు ఉన్న అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్న విజ్ఞప్తిపై పీయూష్‌ గోయల్‌ సానుకూలంగా స్పందించారని బుగ్గన తెలిపారు.

న్యాయ వర్సిటీని కేటాయించండి..
కేంద్ర న్యాయ, ఎలక్ట్రానిక్స్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన బుగ్గన కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తుండటం పట్ల ధన్యవాదాలు తెలిపారు. బెంగళూరులోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని నల్సార్, భోపాల్, జోధ్‌పూర్‌లలో మాదిరిగా న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేయాలని కోరారు.

విద్యుత్‌ బకాయిల సమస్యను పరిష్కరించాలి..
పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ), రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ)లకు సంబంధించి అప్పులను రీస్ట్రక్చర్‌ చేసుకోవడానికి సహకరించాలని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి రాజ్‌కుమార్‌సింగ్‌తో శ్రమశక్తి భవన్‌లో సమావేశంసందర్భంగా బుగ్గన కోరారు. అంతర్‌ రాష్ట్ర విద్యుత్‌ బకా యిల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత సర్కారు హయాంలో చేసుకున్న ఒప్పందాలలో థర్మల్‌ విద్యుత్‌ ధర అధికంగా ఉందని, దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని నివేదించారు. రాష్ట్ర విద్యుత్‌ అవసరాల గురించి తెలుసుకున్న కేంద్రమంత్రి అన్ని విషయాలపై సానుకూలంగా స్పందించారని బుగ్గన తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top