బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టారీతిన వ్యవహరిస్తే ఊరుకునేది లేదని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయ పాలెంలో ఆదివారం వైఎస్సార్‌సీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... విశాఖ, తిరుపతిలో సమావేశాలు ఏర్పాటు చేస్తామని, ఇటువంటి కార్యక్రమాలు అవసరమని తెలిపారు. నేటి సమావేశం తమ బాధలు పంచుకోవడానికి, ఒకరికి ఒకరు అండగా ఉండేందుకేనని చెప్పారు.
‘‘ఎక్కడ సమస్య వస్తే నాయకులమంతా అక్కడికి వెళ్తాం. చట్టానికి మేం వ్యతిరేకం కాదు. మేమంతా చట్టాన్ని గౌరవిస్తాం. రాజకీయాల్లో రివేంజ్ నిర్ణయాలు పనికిరావు. ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చే హక్కుల్ని కోరుతున్నాం. కాపులకు 3.000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. ఒక కోటి రూపాయలు కూడా ఇవ్వలేదు. గతంలో కాపునేస్తం ఇచ్చాం.. ప్రజల అవసరాలు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వాలు సహకారం అందించాలి. ఉన్న వాటిని తీసేస్తే ఊరుకునేది లేదు.
రానున్న రెండు-మూడేళ్లలో కాపు జాతికి గౌరవం పెరిగేటట్టు ప్రయత్నించాలి. ఇది పార్టీలకు పరిమితం కాదు. రాజకీయ పార్టీలో గౌరవం కోరుకుంటాం. కూటమి పార్టీలో కాపులకు అది దక్కటం లేదు. కులంలో ఉన్న వారంతా విద్రోహులు, సంఘ వ్యతిరేక శక్తులు అని మాట్లాడటం సరికాదు.. ఇంకోసారి మాట్లాడితే ఊరుకునేది లేదు. ముద్రగడ కూడా సమావేశానికి హాజరు రావాల్సి ఉంది. ఆరోగ్యం బాగాలేక రాలేదు. సమావేశంలో చర్చించిన ప్రతి అంశాన్ని తీర్మానంగా రూపొందించాం.
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎవరు ముందుకు వచ్చినా అందరూ కలిసి అక్కడ వెళ్లి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరు 50 వేల రూపాయలు చొప్పున వేసుకుని సాయి కృష్ణ కుటుంబానికి అందించాలి.
రాజకీయం కాదు ఒక కుటుంబానికి అందించే సాయం. ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ఇప్పటివరకు చంపిన వ్యక్తి ఎవరో కూడా తెలియదు. ఇదే వేరే కులంలో జరిగితే ఊరుకుంటారా. ఈ సమావేశం కాపు నాయకులందరికీ ఒక సందేశం ఇస్తుంది. మేము మీకు అండగా ఉంటాము అని కాపులందరికీ భరోసా కల్పిస్తుంది’’ అని బొత్స తెలిపారు.
సమావేశంపై ఆరోపణలు
సమావేశంలో రూపొందించిన తీర్మానాలను సభకు కురసాల కన్నబాబు వివరించారు. ముద్రగడ తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అన్నారు. ఈ సమావేశం గురించి సమాచారం బయటకు వచ్చిన వెంటనే కాపులను చీల్చేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ కొందరు ఆరోపణ చేసేశారు.
ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ‘‘నాకు మహిళల పట్ల గౌరవం ఉంది. ఒక వ్యక్తికి సంబంధించిన విషయంలో మాత్రమే మాట్లాడాను. మహిళలందరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదు. ఎక్కువగా కుల ప్రస్తావన చేసింది పవనే’’ అని తెలిపారు.


