ఉపాధికి రక్షణ కవచం! | Sakshi
Sakshi News home page

ఉపాధికి రక్షణ కవచం!

Published Thu, May 11 2023 5:06 AM

BEL Integrated Defense Complex at Pala Samudram - Sakshi

సాక్షి, అమరావతి : పారిశ్రామికంగా రాష్ట్రం శరవేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఓ వైపు పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు.. మరో వైపు సెజ్‌ (స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌)లు, వాటిలో భారీ పరిశ్రమల ఏర్పాటుతో  ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వీటికి అనుబంధంగా ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా లక్షల సంఖ్యలో యువతకు ఉపాధి మార్గాలు చేరువ కానున్నాయి. ఈ నేపథ్యంలో సత్యసాయి జిల్లా పాల సముద్రం వద్ద 914 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగానికి చెందిన భారత్‌ ఎల్రక్టానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌) ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ కాంప్లెక్స్‌ పనులు వేగం అందుకున్నాయి.

ఐదు దశల్లో ఈ యూనిట్‌­ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తొలి దశలో రూ.384 కోట్లతో అభివృద్ధికి బోర్డు ఆమోదం తెలిపింది. త్వరలో జరిగే బోర్డు సమావేశంలో మిగిలిన దశలకు సంబంధించి ఆమోదం లభించనుందని బీఈఎల్‌ అధికారులు తెలిపారు. ఈ ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ కాంప్లెక్స్‌లో రాడార్, మిసైల్, సబ్‌మెరైన్లకు సంబంధించిన పరికరాలను అభివృద్ధి చేయడమే కాకుండా వీటిని పరీక్షించేలా టెస్టింగ్‌ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

తొలి దశకు సంబంధించి క్షిపణుల అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్‌ కార్యకలాపాలకు అవసరమైన మౌలిక వసతులను రూ.148 కోట్లతో అభివృద్ధి చేయడానికి ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. బిడ్‌ దక్కించుకున్న సంస్థ క్షిపణుల తయారీకి సంబంధించి మల్టీ స్టోర్డ్‌ బిల్డింగ్స్, ప్రీ ఇంజనీర్డ్‌ బిల్డ్‌లతో పాటు ఒక ఫ్యాక్టరీకి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు విద్యుత్, నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, వరద నీటి కాల్వలు, అంతర్గత రహదారులు, డ్రెయిన్లు, కల్వర్టులు, వీధి దీపాలు వంటి వాటిని సమకూర్చాల్సి ఉంటుంది.

ఆసక్తి గల సంస్థలు మే 23లోగా బిడ్లను దాఖలు చేయాలని కోరింది. ఇప్పటికే ఈ 914 ఎకరాల చుట్టూ సుమారు రూ.50 కోట్లతో ప్ర­హ­రీ నిర్మించింది. గోడ చుట్టూ రోడ్డు నిర్మాణం పూ­ర్తి కాగా, సొంత అవసరాల కోసం సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయ­ని ఏపీఐఐసీ అధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు.  

చకచకా అనుమతులు 
గత ప్రభుత్వ అసమర్థ నిర్వాకానికి బీఈఎల్‌ ప్రాజెక్టు ఒక ఉదాహరణ. అత్యంత ప్రతిష్టాత్మకమైన క్షిపణులు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి 2016లోనే బీఈఎల్‌ ముందుకు రాగా, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. భూమి కన్వర్షన్, పర్యావరణ అనుమతులు తేవడంలో అప్పటి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంతో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి, త్వరితగతిన అనుమతులు వచ్చేలా చర్యలు చేపట్టారు.

మరోపక్క యూనిట్‌ పనులు ప్రారంభించకపోతే భూ కేటాయింపులు రద్దు చేయడంతో పాటు, పెనాల్టీ విధిస్తామంటూ బీఈఎల్‌కు ఏపీఐఐసీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీంతో బీఈఎల్‌ కొంత సమయం ఇవ్వాలని, పెనాల్టిలు రద్దు చేయాలని కోరింది. గతంలో కంటే పెద్ద యూనిట్‌ ఏర్పాటు చేసేలా, కొత్తగా సమగ్ర ప్రాజెక్టు ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని పరిశీలించిన ఏపీఐఐసీ బోర్డు అన్ని అనుమతులు మంజూరు చేసింది. అనుమతులు రావడంతో బీఈఎల్‌ కూడా యూనిట్‌ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టింది. నిధులు కూడా కేటాయించింది.

రక్షణ రంగంలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై బీఈఎల్‌ అధికారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నం బీఈఎల్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా బోర్డు సమావేశం ఏర్పాటు చేసి, తొలి దశలో రూ.384 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయితే 2025 నాటికి ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.  

డిఫెన్స్‌ హబ్‌గా ఏపీ  
దేశ రక్షణ అవసరాల తయారీ హబ్‌గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ చైర్మన్‌ మెట్టు గోవింద రెడ్డి తెలిపారు. ఇప్పటికే కేంద్ర రక్షణ సంస్థ 914 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ కాంప్లెక్స్‌ అభివృద్ధి చేస్తుండగా ఏపీఐఐసీ కూడా 1,200 ఎకరాల్లో ఏపీ ఏరో స్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ ఎల్రక్టానిక్స్‌ (ఏపీ–ఏడీఈ) పార్క్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో జరిగే ఏపీఐఐసీ బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నామని చెప్పారు.

ఈ  రెండు ప్రాజెక్టుల రాకతో శ్రీ సత్యసా­యి జిల్లాతోపాటు రాష్ట్రం రక్షణ రంగ ఉత్పత్తులకు తయారీ కేంద్రంగా తయారవుతుందన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల రాకతో ప్రత్యక్షంగా 2,800 మందికి, పరోక్షంగా 8,000 మంది వరకు ఉపాధి లభిస్తుంది. యాంకర్‌ యూనిట్‌గా బీఈఎల్‌ భారీ ప్రాజెక్టును చేపడుతుండటంతో అనేక అనుబంధ కంపెనీలు, ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు కానున్నాయి. 

Advertisement
 
Advertisement