బాపట్ల జిల్లా కేంద్రంలో అద్దెల దరవు..! | Baptla District Headquarters: Demand For Rental Houses | Sakshi
Sakshi News home page

బాపట్ల జిల్లా కేంద్రంలో అద్దెల దరవు..!

Jul 23 2022 7:33 PM | Updated on Jul 23 2022 7:33 PM

Baptla District Headquarters: Demand For Rental Houses - Sakshi

సాక్షి, బాపట్ల: రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేసింది. ఫలితంగా బాపట్ల కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు కావడంతో రాష్ట్ర చిత్రపటంలో ప్రత్యేకత స్థానం ఏర్పడింది.  అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం బాపట్ల జిల్లా కేంద్రం కావడం.. జిల్లా స్థాయి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అధికార యంత్రాంగం, ఉద్యోగులు రావడంతో నివాస గృహాలకు డిమాండ్‌ ఏర్పడింది. అద్దె ఇళ్ల కోసం అందరూ ఒకేసారి రావడంతో యజమానులు  సైతం అద్దెలు ఆకాశానికి పెంచేశారు.

బాపట్ల పురపాలక సంఘ పరిధిలో... 
బాపట్ల పురపాలక సంఘ పరిధిలో దాదాపు లక్షకు పైగా జనాభా, దాదాపు 30 వేల వరకు నివాస గృహాలు, 2 వేల వాణిజ్య సముదాయాలు ఉన్నాయి.. భౌగోళికంగా 7 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. చిన్న పట్టణ స్థాయికే పరిమితమైన బాపట్లను జిల్లా కేంద్రం చేయడంతో అధికార యంత్రాంగం అంతా ఇక్కడే పరిపాలన సాగిస్తున్నారు. అటు ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన దాదాపు 2 వేల మందికి పైగా ఉద్యోగులు కొత్తగా వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. పెరిగిన జనాభా అవసరాల మేర నివాస గృహాలు అందుబాటులో లేకపోవడంతో అద్దె ఇళ్లకు డిమాండ్‌ ఏర్పడింది. బదిలీలతోపాటు, ఇతరత్రా కారణాల వలన నివాస గృహలు ఖాళీ అయి ఇల్లు అద్దె బోర్డు కనిపిస్తే చాలు వాలిపోతున్నారు. వారి అవసరాలను గుర్తించిన ఇంటి యజమానులు మాత్రం అద్దెలను రెండింతలు చేసి డిమాండ్‌ సృష్టించారు.

గతంతో పోలిస్తే... 
గతంలో బాపట్ల జిల్లా కేంద్రం కాకముందు సింగిల్‌ బెడ్‌రూం సదుపాయం ఉన్న నివాస గృహం అద్దె రూ.4 వేలకే దొరికేది.. అలాగే డబుల్‌ బెడ్‌రూం సదుపాయాలు ఉన్న నివాస గృహం అయితే నెల అద్దె రూ.7 వరకు ఉండేది.. అందులో పాత బడిన నివాసాలు, నిర్మించిన భవనాలకు అద్దెలు మార్పు ఉండేది.. ప్రస్తుతం గృహాలు అవే అయినా అద్దెల్లో మాత్రం మార్పు ఉంది. సింగిల్‌ బెడ్‌రూం గృహానికి రూ.7వేలు పైగా అద్దె చెబుతుండగా, డబుల్‌బెడ్‌రూం గృహానికి రూ.12 వేల వరకు అద్దె నిర్ణయించి యజమానులు చెబుతున్నారు. దీంతో అమాంతంగా పెరిగిన ఇంటి అద్దెలతో చిరుద్యోగులు హడలిపోతున్నారు. అధికారులు, ఉద్యోగులు వారి కొచ్చే నెలజీతం బట్టి నివాస గృహాలను ఎంపిక చేసుకుంటారు. నెలవారీ జీతం ఇంటి అద్దె నుంచి ఇతరత్రా కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, వ్యక్తగత అవసరాలు అన్నింటిని ఆ నెల జీతంతోనే సర్దుకుపోవాలి.

దీంతో జీతాన్ని బట్టి నివాస గృహాన్ని ఎంపిక చేసుకుంటారు. కానీ చిరుద్యోగులు మాత్రం బాపట్లలో పెరిగిన అద్దెలు చూసి ఆందోళన చెందుతున్నారు. ఇంటి అద్దెకే వేలాది రూపాయలు వెచ్చిస్తే తమ కుటుంబ అవసరాలు ఏలా తీర్చుకోవాలని మదనపడుతున్నారు. దీంతో చాలా వరకు ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. నూతన జిల్లా కావడం పరిపాలన ప్రక్రియ వేగవంతం కాలేదు. మరికొన్ని రోజుల్లో పాలన పరమైన ప్రక్రియ వేగవంతమైతే ఉద్యోగులు స్థానికంగానే నివాసం ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆకాశానంటుతున్న అద్దెల భారంతో ఆందోళన చెందుతున్నారు. 

అద్దెలు చెల్లించడం భారంగా ఉంది  
బాపట్లలో జిల్లా ఏర్పాటుకు ముందు ఇంటి అద్దెలు సామాన్యులకు అందుబాటులో ఉండేవి. జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్న గృహాల యజమానులు ఒక్కసారిగా ఇంటి అద్దెలను అమాంతం పెంచేశారు. గతంలో రూ. 3500 నుంచి 4000 వరకు అద్దె చెల్లిస్తే బాపట్లలో డబల్‌బెడ్‌రూమ్‌ కలిగిన గృహం అద్దెకు లభించేది ప్రస్తుతం డబుల్‌ బెడ్‌రూం అద్దెకు కావాలంటే రూ. 7500 నుంచి 10 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. జిల్లా అధికారులు స్పందించి అద్దె నియంత్రణకు చర్యలు చేపట్టాలి.  
– సీహెచ్‌ జనార్ధన్‌రావు, బాపట్ల   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement