సర్పం.. ప్రకృతి నేస్తం! పాములు కాటు ఎందుకు వేస్తాయంటే?

Awareness programs on snake conservation - Sakshi

పర్యావరణాన్ని కాపాడడంలో పాములది కీలక పాత్ర 

కనిపించేవన్నీ విషపూరితం కాదు 

భయంతోనే కాటేస్తాయి 

ఈస్టర్నఘాట్‌ వైల్డ్‌లైఫ్‌ సొసైటీ ప్రత్యేక అధ్యయనంలో వెల్లడి 

పాముల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు 

పాములు పట్టడంపై పలువురికి శిక్షణ 

తిరుపతి అలిపిరి: సర్పం (పాము) అంటేనే హడలిపోతారు. పేరు విన్నా.. చూసినా వణికిపోతారు. భయంతో పరుగులు తీస్తారు. పాము కనబడిందంటే రాళ్లు, కర్రలతో కొట్టేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కొన్ని కాటేయడం.. మనుషులు చనిపోవడం లాంటివి జరుగుతుంటాయి. కానీ ప్రకృతికి పాములు జీవన నేస్తాలని నిపుణులు చెబుతున్నారు. పాముల వల్ల భూమికి, రైతులకు, అటవీ జంతువులకు ఎంతో ఉపయోగకరమని అంటున్నారు. అది ఎలా.. ఎందుకో.. మీరే చదవండి.. 

విషపూరితం నాలుగే 
ప్రపంచంలో మూడు వేల రకాల సర్పజాతులుండగా.. అందులో 300 జాతులు భారతదేశంలో ఉన్నాయి. వీటిలో 90శాతం కన్నా ఎక్కువ విషరహిత సర్పాలే. పాముకాటు మరణాలు కలిగించే అతి సాధారణమైన విషపూరిత జాతులు నాలుగు మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.  

భయంతోనే కాటు  
► మానవునికి పాములంటే ఎంత భయమో పాములకు కూడా అంతే భయం ఉంటుంది.  
► పాము తారసపడినప్పుడు భయంతో పరుగులు తీయకుండా ఆ ప్రదేశం నుంచి మెల్లగా వచ్చేయాలని, భయం కలిగించడానికో.. తరమడానికో ప్రయత్నం చేస్తే కాటువేయడం ఖాయం.  
► దాక్కున్న పాములను మాత్రమే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలి.  
► పామును చంపడం వంటివి చేయకూడదు.  

కనిపించేవన్నీ విషపూరితం కాదు 
మనకు కనిపించే ప్రతి పాము విషపూరితం కాదు. సాధారణంగా మన ప్రాంతంలో నాగుపాము, రాచనాగు, కట్లపాము, సా స్కేల్‌ వైపర్‌ (పోడపాము), రక్తపింజరి, బాంబు పిట్‌ వైపర్‌(పోడపాము), స్లేన్డర్‌ కోరల్‌ స్నేక్, కామన్‌ సీ స్నేక్‌ (సముద్రపు సర్పం)లు మాత్రమే విషపూరితమైనవి. బ్యాండెడ్‌ రేసర్, బ్‌లైండ్‌ స్నేక్, ఇలియాట్‌ షీల్డ్‌ టెయిల్, రెండు తలల పాము, కొండచిలువ, జెర్రిపోతు, రుసుల్స్‌ కుక్రి, రేడియేటెడ్‌ ర్యాట్‌ స్నేక్, ట్రింకెట్‌ పాము, కేట్‌ స్నేక్, బ్లాక్‌ హెడెడ్‌ స్నేక్, పసరిక పాము, నూనె పలుగుడు, జెర్రికట్ట పాము, మాను పాము, కడ్డీల సర్పము, నీటిపాము, కీల్‌బ్యాక్‌ వంటివి విషరహితమని నిపుణులు చెబుతున్నారు. 

బయోలాజికల్‌ పెస్ట్‌ కంట్రోలర్‌లుగా.. 
ప్రకృతిలో పాములు ఎలుకలను చంపి తినడంలో కీలకపాత్ర పోషిస్తాయి. రైతులకు ఎలుకల వల్ల పంట నష్టం కలగకుండా తోడ్పడతాయి. విషరహిత సర్పమైన జెర్రిపోతు ఏడాదికి సుమారు 400 ఎలుకలను వేటాడి తింటుంది. అంతే కాకుండా పాములను తినే ప్రాణులు అడవిలో ఉంటాయి. వాటి ఆహారం కోసమైనా పాములను రక్షించాలి. 

పాములు రాకుండా జాగ్రత్తలు ఇలా.. 
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యర్థ పదార్థాలను దిబ్బలుగా ఉంచరాదు. తద్వారా కప్పలు, బల్లులు, ఎలుకలు వచ్చి చేరుతాయి. వాటి కోసం పాములు వచ్చే అవకాశం ఉంది. పెరట్లో, ఇంటి ముందు నాటిన మొక్కలను ట్రిమ్‌ చేసి ఉంచితే పాములను కనిపెట్డానికి సులువుగా ఉంటుంది. గ్రామాలలో, పంట పొలాల్లో నేలపై పడుకొనేవారు తప్పనిసరిగా దోమతెరవంటివి వాడడం మంచిది. రాత్రిల్లో నడిచేటప్పుడు దివిటీ తప్పనిసరి. తుప్పు, ఎండు ఆకులలో అజాగ్రత్తగా చేతులు పెట్టరాదు. 

పాములపట్టడంపై అవగాహన  
పాములు కాపాడుకోవాల్సిన ఆవశ్యకంపై సోమవారం తిరుపతి శ్రీవేంకటేశ్వర జూ పార్క్‌లో విశాఖపట్టణం నుంచి వచ్చిన ఈస్టర్ణ్‌ ఘాట్‌ వైల్డ్‌ లైఫ్‌ సోసైటీ డైరెక్టర్‌ కేఎల్‌ఎన్‌ మూర్తి అవగాహన కల్పించారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల అటవీశాఖాధికారులతో పాటు పలువురు విద్యార్థులకు క్యురేటర్‌ సెల్వం నేతృత్వంలో అవగాహన కల్పించారు. నాగుపామును  పట్టుకొని అడవిలో ఎలా విడిచి పెట్టాలి అనే అంశంపై వివరించడంతో పాటు సాధారణంగా కనిపించే జెర్రిపోతును పట్టుకొనే విధానాలను ఆయన వివరించారు. ఆ మేరకు కొంతమంది అటవీశాఖ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.  

పాములను రక్షించాలి  
పాములు సాధారణంగా భయంతోనే కాటేస్తాయి. పాములు అడవిలో మరొక జంతువులకు ఆహారంగా ఉంటాయి. ఆంధ్రాలో నమోదవుతున్న పాముకాట్ల నేపథ్యంలో పాములపై అవగాహన కల్పించేందుకు ఈస్టర్ట్‌ ఘాట్‌ సొసైటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సున్నితంగా, సులువుగా పామును పట్టుకొని ఎంపిక చేసుకున్న ప్రాంతంలో వాటిని వదిలిపెట్టేలా కొంతమందికి శిక్షణ ఇస్తున్నాం. అటవీశాఖ సహకారంతో యువకులకు శిక్షణ ఇస్తాం.      
– కె.ఎల్‌.ఎన్‌ మూర్తి ఈస్టర్న్‌ ఘాట్స్‌ సొసైటీ డైరెక్టర్‌ 
 
స్నేక్‌ క్యార్స్‌ వద్ద శిక్షణ 

యువకులు ముందుకు వస్తే నిష్ణాతులైన స్నేక్‌ క్యాచర్స్‌ వద్దకు పంపించి శిక్షణ ఇప్పిస్తాం. అటవీశాఖలో ఉన్న సిబ్బందిలో కొంతమందికి స్నేక్‌ క్యాచింగ్‌పై శిక్షణ ఇప్పిస్తున్నాం. ప్రజలకు అవగాహనతో పాటు పాములను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించే కార్యక్రమాలు చేపడుతున్నాం. అటవీశాఖ ఆధ్వర్యంలో వలంటీర్లుగా నియమించి పాములు పట్టించే కార్యక్రమం జరుగుతుంది. దానికి కావలసిన వస్తు సామాగ్రిని అటవీశాఖ నుంచే సమకూరుస్తాం.  
– సెల్వం, క్యూరేటర్, జూపార్క్, తిరుపతి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top