'సీమ' ఎత్తిపోతలే శరణ్యం

AP Water Resources Department officials appeal to EAC - Sakshi

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అక్రమంగా నీటిని తోడేస్తున్న తెలంగాణ 

దీనివల్ల తీవ్ర కరవు ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లందించలేని దుస్థితి 

చెన్నైకి తాగునీరు సరఫరా చేయలేని పరిస్థితి 

ఈ దుస్థితిని అధిగమించడానికే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టాం 

ఎకో సెన్సిటివ్‌ జోన్‌కు 18 కిలోమీటర్ల దూరంలో ఈ ఎత్తిపోతల 

అత్యావశ్యకమైన ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వండి 

ఈఏసీకి రాష్ట్ర జలవనరులశాఖ అధికారుల విజ్ఞప్తి 

సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ సర్కార్‌ అక్రమంగా నీటిని తోడేస్తున్న నేపథ్యంలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకమే శరణ్యమని ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటీ (ఈఏసీ)కి రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఎకో సెన్సిటివ్‌ జోన్‌కు 18 కిలోమీటర్ల దూరంలో చేపట్టే ఈ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర అటవీ, పర్యావరణశాఖకు నివేదిక ఇస్తామని ఈఏసీ పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి పర్యావరణ అనుమతిపై కేంద్ర అటవీ, పర్యావరణశాఖ నేతృత్వంలో 15 మంది ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలతో కూడిన ఈఏసీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమైంది.

ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, సీఈ మురళీనాథ్‌రెడ్డి హాజరయ్యారు. శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటిమట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా డిజైన్‌ మేరకు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, చెన్నైలకు.. ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌ ప్రాజెక్టుల ద్వారా 44 వేల క్యూసెక్కులే తీసుకెళ్లవచ్చునని, 854 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉంటే అత్యవసరాలకు 6 వేల క్యూసెక్కులు తరలించవచ్చని ఈఏసీకి రాష్ట్ర అధికారులు వివరించారు. తెలంగాణ సర్కార్‌ ఇష్టారాజ్యంగా విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల శ్రీశైలంలో నీటిమట్టం పెరగడం లేదని, దీంతో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి కాలువల ద్వారా నీటిని తరలించలేని దుస్థితి నెలకొందని చెప్పారు.

ఈ దుస్థితి అధిగమించడానికే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి పోతిరెడ్డిపాడు దిగువన కాలువలోకి రోజుకు 3 టీఎంసీలను ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల చేపట్టామన్నారు. దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించడానికి ఇది అత్యావశ్యకమని వివరించారు. ఈ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వాలని కోరారు. పాత ప్రాజెక్టులైన ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌లకు ఇంతకుముందే పర్యావరణ అనుమతి తీసుకున్నామని, వాటి ఆయకట్టుకు నీళ్లందించడానికి చేపట్టిన ఈ ఎత్తిపోతలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అధికారుల ఇచ్చిన వివరణ, తమ అధ్యయనంలో వెల్లడైన అంశాల ఆధారంగా కేంద్ర అటవీ, పర్యావరణశాఖకు ఇవేదిక ఇస్తామని ఈఏసీ పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర అటవీ, పర్యావరణశాఖ రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వడంపై నిర్ణయం తీసుకోనుంది.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top