AP New Cabinet: జగన్‌ మార్క్‌.. సామాజిక న్యాయం | Sakshi
Sakshi News home page

AP New Cabinet: జగన్‌ మార్క్‌.. సామాజిక న్యాయం

Published Mon, Apr 11 2022 9:52 AM

AP New Cabinet: Vishwaroop Venugopalakrishna Taneti Vanitha Dadisetti Raja Profile - Sakshi

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కేబినెట్‌ పునర్వవస్థీకరణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు అగ్రాసనం వేశారు. కేబినెట్‌ కూర్పులో పార్టీ అజెండా ప్రకారం ఎస్సీ, బీసీ వర్గాలకు మూడొంతులు ప్రాతినిధ్యం కల్పిస్తూనే సామాజిక సమతూకాన్ని కూడా పాటించారు. తొలి కేబినెట్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహించగా జిల్లాల పునర్విభజన తరువాత ఏర్పడుతున్న కేబినెట్‌లో ప్రాతినిధ్యం నాలుగుకు పెరిగింది. పార్టీపై నిబద్ధత, పనితీరు, సీనియారీటీ, నాయకత్వ పటిమ, సమర్థతలే కొలమానంగా మంత్రుల ఎంపిక జరిగింది.

రెండేళ్లలో జరగబోయే  సార్వత్రిక ఎన్నికల టీమ్‌గా సీఎం కేబినెట్‌లోకి ఏరికోరి మంత్రులను తీసుకున్నారు. జిల్లాల విభజన తరువాత ఏర్పడ్డ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి నలుగురుకి ప్రాతినిధ్యం లభించడంపై జిల్లాల్లో పార్టీ శ్రేణులు సంబరాలలో మునిగితేలుతున్నాయి. తొలి కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనితలకు మరోసారి చోటు కల్పించారు. కాకినాడ జిల్లా నుంచి ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు తొలిసారి కేబినెట్‌లో అవకాశం లభించింది. ఉమ్మడి జిల్లా నుంచి నలుగురుకి ప్రాతినిధ్యం కలి్పంచగా ఎస్సీల నుంచి ఇద్దరికి, బీసీల నుంచి ఒకరికి అవకాశం కల్పించారు.

నాలుగోసారి మంత్రిగా విశ్వరూప్‌  
మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనుంగ శిష్యుడైన విశ్వరూప్‌ నాలుగోసారి మంత్రి అవుతున్నారు. 2009లో వైఎస్‌ కేబినెట్‌లో తొలిసారి మంత్రిగా నియమితులైన విశ్వరూప్‌ వైఎస్‌ మరణానంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో కూడా కొనసాగారు. మంత్రిగా పదవీ కాలం ఆరు నెలలుండగానే మహానేతతో ఉన్న అనుబంధంతో పదవిని తృణప్రాయంగా విడిచిపెట్టి జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు. ఆవిర్భావం నుంచి పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసి కోనసీమలో ఎస్సీ సామాజికవర్గంతో పాటు ఇతర సామాజికవర్గాల్లో మంచి పట్టు సాధించి సమర్థత కలిగిన నేతగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే తొలి కేబినెట్‌లో ఉన్న విశ్వరూప్‌ను రెండోసారి కేబినెట్‌లోకి కూడా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్నారు. విశ్వరూప్‌ను కేబినెట్‌లో కొనసాగించడం ద్వారా కోనసీమ జిల్లాలో బలమైన సామాజికవర్గాల పరంగా మంచి ముద్ర వేస్తారని నేతలు విశ్లేషిస్తున్నారు. విశ్వరూప్‌ వివాదరహితుడిగా ఉండడం రెండోసారి మంత్రి పదవి దక్కడానికి ఒక కారణమైంది.

మరోసారి కేబినెట్‌లోకి వేణు
బీసీ సంక్షేమశాఖా మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రెండోసారి కేబినెట్‌లోకి తీసుకున్నారు. వేణు ఎంపిక ద్వారా బలహీనవర్గాలలో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి సీఎం సముచిత ప్రాతినిధ్యం కల్పించారు. దివంగత మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు ముఖ్య అనుచరుడిగా ఆయన ఉండేవారు. కోనసీమలో రాజోలు ప్రాంతానికి చెందిన వేణు సమర్థతను గుర్తించిన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడిగా చేశారు. అనంతరం ఓదార్పు యాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచిన వేణు నాటి నుంచి పార్టీ పట్ల విధేయతతో పనిచేశారు. శెట్టిబలిజల్లో బలమైన నేతగా ఉన్న వేణును రామచంద్రపురం నుంచి పోటీచేయించి ఎమ్మెల్యేను చేసి తొలి కేబినెట్‌లో మంత్రిగా కూడా చేశారు. ఇప్పుడు రెండోసారి కేబినెట్‌లో కూడా ప్రాతిని«ధ్యం కలి్పంచడం ద్వారా ఆ సామాజికవర్గానికి  సముచిత స్థానం దక్కింది. వేణు వాగ్ధాటితో పార్టీ వాణిని బలంగా వినిపించడం, బీసీ సంక్షేమశాఖను సమర్థంగా నిర్వహించడం కూడా కలిసి వచ్చింది.

శ్రమించిన వనితకు మరో చాన్స్‌ 
కొవ్వూరు నియోజకవర్గం ఏర్పాటు తరువాత తొలి మహిళా ఎమ్మెల్యే, మంత్రిగా తానేటి వనితకు రెండోసారి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో అవకాశం కలి్పంచారు. 2012లో వైఎస్సార్‌ సీపీలో చేరిన వనిత అప్పటి నుంచి పార్టీ కోసం శ్రమించారు. సాధారణ గృహిణిగా ఉన్న వనిత తండ్రి, మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని పార్టీ ప్రగతిలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2019లో వైఎస్సార్‌ సీపీ నుంచి ఎమ్మెల్యే అయిన వనిత తొలి కేబినెట్‌లో స్త్రీశిశుసంక్షేమశాఖ మంత్రిగా సమర్థవంతమైన సేవలందించారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా మహిళలకు ఆది నుంచి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కొవ్వూరు నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎమ్మెల్యేగా ఉన్న వనితకు మంత్రి పదవి కట్టబెట్టారు. సమర్థత, పార్టీలో సామాజిక సమతూకాలను బేరీజు వేసుకుని వనితకు మరోసారి అవకాశం కల్పించడం ద్వారా ఎస్సీలలో మాదిగ సామాజిక వర్గానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రాతినిధ్యం కల్పించడంపై హర్షం వ్యక్తమవుతోంది.

నిబద్ధతకు గుర్తింపు 
మూడు దశాబ్దాలపాటు తునిలో రాజకీయాలను శాసించిన యనమల వంటి రాజకీయ వటవృక్షాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేసిన తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజాను ముఖ్యమంత్రి జగన్‌ తన కేబినెట్‌లో తొలిసారి తీసుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో ఒక సైనికుడిలా పనిచేస్తూ వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో పోరాట పటిమతో పార్టీని విజయ పథం వైపు నడింపించడం తాజా మంత్రి వర్గంలో తీసుకోవడానికి దోహదం చేసింది. వాస్తవానికి తొలి కేబినెట్‌లోనే చాన్స్‌ దక్కుతుందని పార్టీ శ్రేణులు ఆశించాయి. చివరకు వివిధ సమీకరణల్లో ప్రభుత్వ విప్‌ లభించింది. అప్పుడే మలివిడత కేబినెట్‌లో బెర్త్‌ ఖాయమైంది. అందుకు అనుగుణంగానే కాకినాడ జిల్లా నుంచి రాజాను మంత్రి పదవి వరించింది.

తుని నియోజకవర్గం నుంచి వరుసగా రెండు పర్యాయాలు యనమల సోదరుడిపై గెలుపొందడమే కాకుండా నియోజకవర్గ టీడీపీ నేతలకు సింహస్వప్నంగా నిలిచారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వంటి అక్రమ కేసులతో వేధింపులు ఎదుర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీని వీడి పారీ్టలోకి రావాలని పలు ప్రలోభాలకు గురిచేసినా లెక్క చేయకుండా పార్టీ పైన, అధినేత జగన్‌పైన ఎంతో విశ్వాసంతో పార్టీ వెన్నంటి నిబద్ధతతో నిలవడం కలిసి వచ్చింది. కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాలుంటే ఆరు నియోజకవర్గాల నుంచి కాపు సామాజిక వర్గీయులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మలి కేబినెట్‌లో రాజాకు అవకాశం కల్పించి ఆ సామాజిక వర్గానికి పెద్ద పీటేశారు. తునిలో ఆ సామాజికవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం ఇదే ప్రథమం. మంత్రి పదవి కూడా జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్‌లో దక్కడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆ సామాజికవర్గీయుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

కోనసీమకు జోడు పదవులు... 
జిల్లాల విభజన తరువాత కోనసీమకు జోడు పదవులు దక్కాయి. జిల్లాల పునర్విభజన తరువాత దాదాపు ఒకో జిల్లాకు ఒకో మంత్రి పదవి దక్కిన క్రమంలో కోనసీమ జిల్లాకు ఒకేసారి రెండు బెర్త్‌లు దక్కాయి. ఆ రెండు కూడా ఎస్సీ, బీసీలకే కట్టబెట్టడం ద్వారా ఆ వర్గాలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న అభిమానం తేటతెల్లం అవుతోంది. కోనసీమ జిల్లాలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వు›కావడంతో ఆ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్టయ్యింది. అమలాపురం నుంచి విశ్వరూప్,  రామచంద్రపురం నుంచి వేణులను కేబినెట్‌లోకి తీసుకోవడం ద్వారా సీనియర్‌లను కొనసాగించినట్టయింది. వైఎస్సార్‌ సీపీకి తొలి నుంచి వెన్నంటి నిలుస్తోన్న ఎస్సీ, బీసీ సామాజికవర్గాలకు ఈ కేబినెట్‌లో సముచిత స్థానం కల్పించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న బీసీలు, కాపులు, మాల, మాదిగలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడంపై పార్టీ శ్రేణుల్లోనే కాకుండా మూడు జిల్లాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

Advertisement
Advertisement