AP New Cabinet Minister RK Roja Political Profile And Biography In Telugu, Details Inside- Sakshi
Sakshi News home page

AP Cabinet Minister RK Roja: రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌.. ఆమెకు సరిలేరు

Published Sun, Apr 10 2022 8:11 PM

AP New Cabinet Minister RK Roja Profile - Sakshi

నిజ జీవిత కథలు సినిమాలు అవుతాయి. కానీ సినిమా కథలు జీవితంగా మారుతాయన్న దానికి నిదర్శనం. ఒకే వ్యక్తి వేర్వేరు రంగాల్లో రాణించడం కూడా రోజాకే చెల్లుబాటయింది. సినీ నటిగా ఎంత పేరు తెచ్చుకుందో, బుల్లి తెర వ్యాఖ్యాతగా అంతే స్థాయిలో రాణించిన రోజా… రాజకీయాల్లో తనదైన శైలిలో ముద్ర వేశారు. 

కుటుంబ నేపథ్యం
రోజా అసలు పేరు శ్రీలత. 17/ 11 /1972న జన్మించారు. తండ్రి కుమారస్వామి రెడ్డి చిత్తూరు జిల్లా నుంచి హైదరాబాద్‌కి వలస వెళ్లారు. రోజా నాగార్జున యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ నుంచి డిగ్రీ అందుకున్నారు. కొన్ని సంవత్సరాలు కూచిపూడి నృత్యాన్ని నేర్చుకున్నారు. బిఎస్‌సీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ప్రేమ తపస్సు చిత్రం ద్వారా సినిమాలకు పరిచయమయ్యారు రోజా. దానికంటే ముందు తమిళచిత్రం చంబరతి చిత్రంలో నటించారు. ఆ సినిమా తమిళంలో మ్యుజికల్ హిట్. తెలుగులో చేమంతి కింద డబ్ చేశారు. ఆ సినిమాను ప్రముఖ ఛాయా గ్రహకుడు, దర్శకుడు అయిన ఆర్కే సెల్వమణి రూపొందించాడు. ఆయనతోనే ప్రేమలో పడిపోయిన రోజా పెద్దల అంగీకారంతో దంపతులయ్యారు. వీరికి కుమార్తె అన్షు మాలిక, కొడుకు కృష్ణ కౌశిక్ ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం
2004లో రాజకీయాల్లోకి వచ్చిన రోజా నగరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి వారి చెంగారెడ్డి పై పోటీ చేశారు. 2009లో చంద్రగిరి నియోజకవర్గంలో మరోసారి పోటీ చేశారు కానీ ఫలితం దక్కలేదు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్లో చేరిన రోజా.. ఆ తర్వాతి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు నగరి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు.  2014 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దివంగత నేత గాలి ముద్దుకృష్ణనాయుడు పై విజయం సాధించిన రోజా.. 2019 ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ పై  గెలిచి సత్తా చాటారు.

వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా,ఫైర్ బ్రాండ్‌గా పేరున్న ఆర్కే రోజా.. ఏ మాత్రం తేడా వచ్చినా విపక్షాలను తూర్పూరపట్టగలరు. తనదైన శైలిలో రాజకీయ విమర్శలు చేయడంలో ఆమెకు సరిలేరు. 2020 నుంచి రెండేళ్ల పాటు ఏపిఐఐసి చైర్ పర్సన్ గా పనిచేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement