తిరుపతి కలెక్టరేట్ వద్ద వైద్య విద్యార్థుల భారీ నిరసన
తిరుపతి అర్బన్: పోలీసులు తమను వేధిస్తున్నారంటూ ఎస్వీ మెడికల్ కళాశాల విద్యార్థులు తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో చదువుతున్న 500 మంది విద్యార్థులు వెస్ట్ పోలీసులకు వ్యతిరేకంగా నిరసన తెలిపి కలెక్టర్‌కు వినతిపత్రమిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 1 రాత్రి ఆస్పత్రిలో విధులు పూర్తయిన తర్వాత వైద్య విద్యార్థులు హరీష్, జయంత్ భోజనం కోసం వెస్ట్ పోలీస్‌స్టేషన్ వైపు బైక్‌పై వెళుతుంటే పోలీసులు ఆపారని చెప్పారు.
తాము మెడికల్ విద్యార్థులమని చెప్పినా తమపై దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు. తాము వారిని గట్టిగా ప్రశ్నిస్తే దాడి చేశారని చెప్పారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి ఎస్‌ఐకి ఫిర్యాదు చేశామనీ ఆయనతో పాటు యూనిఫాంలో లేని కొందరు లాఠీలతో దాడి చేశారని చెప్పారు. డ్యూటీల నిమిత్తం వైద్య విద్యార్థి, విద్యార్థిని వెళుతుంటే అసభ్యంగా మాట్లాడుతున్నారని వాపోయారు.
తమ మొబైల్, స్కూటర్‌ను లాక్కున్నారని వివరించారు. ఆస్పత్రిలో డ్యూటీలు చేస్తూ కాఫీ, టీ తాగడానికి రోడ్లపైకి వచ్చినా పోలీసులు ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారన్నారు. ఈ క్రమంలో న్యాయం కోసం కలెక్టర్ వెంకటేశ్వర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చి తమ సమస్యను వివరించినట్లు వెల్లడించారు. వైద్య విద్యార్థులకు పోలీసులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
