AP High Court Serious On ABN Andhra Jyothi Journalism And Writings - Sakshi
Sakshi News home page

ఇవేం రాతలు? ఆంధ్రజ్యోతి కథనంపై హైకోర్టు ఆగ్రహం

Jan 6 2022 7:45 AM | Updated on Jan 6 2022 10:36 AM

AP High Court Serious On ABN Andhra Jyothi Journalism And Writings - Sakshi

సాక్షి, అమరావతి:  ఉపాధి హామీ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నయాపైసా కూడా చెల్లించలేదంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక బుధవారం ప్రచురించిన కథనంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. తామిచి్చన ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కాంట్రాక్టర్ల తరఫు న్యాయవాదులే స్వయంగా చెబుతుంటే.. నయాపైసా కూడా చెల్లించడం లేదంటూ అసత్యాలతో కథనం ఎలా రాస్తారంటూ న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఉత్తర్వుల గురించి రాసే ముందు పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఇలాంటి కథనాలు దురదృష్టకరమన్నారు.  

కోర్టు దృష్టికి తెచ్చిన ప్రభుత్వ న్యాయవాది.. 
పంచాయతీరాజ్‌ విభాగంలో బకాయిలు చెల్లించకపోవడంపై దాఖలైన కొన్ని వ్యాజ్యాలు జస్టిస్‌ దేవానంద్‌ ఎదుట విచారణకు వచ్చాయి. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.వేల కోట్ల మేర చెల్లింపులు చేసిందని ప్రభుత్వ న్యాయవాది వడ్లమూడి కిరణ్‌ నివేదించారు. ప్రభుత్వం ప్రతిరోజూ చెల్లింపులు చేస్తూనే ఉందన్నారు. అయితే ఆంధ్రజ్యోతి పత్రిక నయాపైసా కూడ చెల్లించడం లేదని తప్పుడు కథనాన్ని ప్రచురించిందని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు.  


పాత్రికేయ విలువలు పతనం

న్యాయమూర్తి: ఇవేం రాతలు?.. ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదా? 
ప్రభుత్వ న్యాయవాది : రూ.వేల కోట్ల చెల్లింపులు చేస్తున్నాం. వేల సంఖ్యలో కేసులు దాఖలైతే అందులో బిల్లులు చెల్లించలేదంటూ దాఖలైన ధిక్కార కేసులు 50–60 మాత్రమే ఉంటాయి. 

న్యాయమూర్తి : మరి వాస్తవాలు తెలుసుకోకుండా ఆ పత్రిక ఎలా కథనం రాస్తుంది? నయాపైసా చెల్లించడం లేదని ఎలా చెబుతుంది? 
ప్రభుత్వ న్యాయవాది: అందుకే పత్రికల తీరును కోర్టు దృష్టికి తీసుకొస్తున్నాం. 

న్యాయమూర్తి : వాస్తవాలు తెలుసుకోకుండా, ఆధారాలు లేకుండా ఇలాంటి కథనాలను ప్రచురించడం న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే. ఇలాంటి కథనాల వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి. ప్రజలు సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మీడియాపై ఆధారపడతారు కాబట్టి వాస్తవ సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది. అవాస్తవాలతో కథనాలు రాయడం ఎంతమాత్రం మంచిది కాదు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు నయాపైసా చెల్లించలేదంటూ అవాస్తవ కథనం రాయడం దురదృష్టకరం. బొక్కా సత్యనారాయణ, కాల్వ సురేష్‌ కుమార్‌రెడ్డి (కాంట్రాక్టర్ల తరఫు న్యాయవాదులనుద్దేశించి) బిల్లులు చెల్లించడం లేదంటూ మీరు వందల సంఖ్యలో కేసులు వేశారు కదా? కోర్టు ఆదేశాలు ఇచి్చన తరువాత మీకు (కాంట్రాక్టర్లు) ప్రభుత్వం చెల్లింపులు చేయలేదా? 
బొక్కా సత్యనారాయణ: మా అందరికీ ప్రభుత్వం బిల్లులు చెల్లించింది.  
కాల్వ సురేశ్‌ కుమార్‌రెడ్డి: మాకు కూడా ప్రభుత్వం చెల్లింపులు చేసింది. 
న్యాయమూర్తి: పత్రికలు యథార్థాలు తెలుసుకుని  రాయాలి. వ్యక్తిగత అభిప్రాయాలను కాదు. 
సత్యనారాయణ, సురేశ్‌: కొన్ని పత్రికలు అలా రాయడం లేదు. 
కోటిరెడ్డి (జెడ్పీపీ, ఎంపీపీ స్టాండింగ్‌ కౌన్సిల్‌): జీవో–2 విషయంలో కూడా ఇలానే టీవీల్లో తప్పుడు వార్త వచి్చంది. కోర్టులో జరిగింది ఒకటైతే మీడియా మరొకటి వేసింది. 
న్యాయమూర్తి: జీవో–2 విషయంలో ప్రభుత్వం ఏం చేయాలన్నది ప్రభుత్వ పరిశీలనలో ఉందని మాత్రమే ప్రభుత్వ న్యాయవాది శివాజీ చెప్పారు. అంతకు మించి ఏమీ చెప్పలేదు. 
కోటిరెడ్డి: కాని జీవో 2ను ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు స్క్రోలింగ్‌లు వచ్చాయి. 
న్యాయమూర్తి: కోర్టు ఆదేశాలను ఐదారు సంవత్సరాలపాటు కూడా అమలు చేయని అధికారిని శిక్షిస్తూ తీర్పునిస్తే మరుసటి రోజు కొన్ని పత్రికల్లో జగన్‌కు షాక్‌ అంటూ పతాక శీర్షికల్లో కథనాలు వస్తున్నాయి. అధికారికి శిక్ష వేయడానికీ, ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ఆ అధికారి ఎవరు, ఆయన ఏం చేశారన్నది కూడా ముఖ్యమంత్రికి తెలిసే అవకాశం ఉండదు. అలాంటప్పుడు కోర్టు ఉత్తర్వులను జగన్‌కు ఎలా ఆపాదిస్తారు? ఇదేనా జర్నలిజం.

ఇవేనా పాత్రికేయ విలువలు? ఇలాంటి కథనాలతో ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని పత్రికలు అనుకుంటున్నాయి? సోషల్‌ మీడియా వచ్చిన తరువాత పత్రికా విలువలు పడిపోయాయి. అనారోగ్య పోటీ పెరిగిపోయింది. అనేక చెడు సంప్రదాయాలకు తెర లేపారు. ఇలాంటివన్నీ రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణాన్ని, ఆపార్థాలను సృష్టిస్తాయి’ అని న్యాయమూర్తి అన్నారు. అనంతరం బిల్లుల కోసం దాఖలు చేసిన వ్యాజ్యాల్లో చెల్లింపు నిమిత్తం ప్రభుత్వానికి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement