ఎస్‌ఈసీకి హైకోర్టు ఝలక్‌

AP High Court given shock to SEC Nimmagadda Ramesh - Sakshi

సాక్షి, అమరావతి: విశేషాధికారాల పేరుతో చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కు హైకోర్టు గట్టి ఝలక్‌ ఇచ్చింది. మునిసిపల్‌ ఎన్నికల నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసిన తరువాత కూడా పలుచోట్ల పలువురు అభ్యర్థులను నామినేషన్ల దాఖలుకు అనుమతినిస్తూ ఎన్నికల కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపివేసింది. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై ఫిర్యాదులు స్వీకరించాలని రిటర్నింగ్‌ అధికారులను ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఉత్తర్వుల అమలును కూడా నిలుపుదల చేసింది. మరోవైపు మునిసిపల్‌ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకోకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఆదేశాల అమలును హైకోర్టు నిలిపివేసింది. దీనికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను తోసిపుచ్చింది. ఎన్నికల కమిషన్‌ చర్యలన్నీ చట్టానికి లోబడి మాత్రమే ఉండాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు బుధవారం వేర్వేరుగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

నామినేషన్లపై ఇవీ వ్యాజ్యాలు...
నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత కూడా నామినేషన్ల దాఖలుకు అనుమతిస్తూ ఎన్నికల కమిషన్‌ ఈ నెల 1న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటి మునిసిపాలిటీకి చెందిన పాపిరెడ్డి మదన్‌మోహన్‌రెడ్డి, తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన వి.ఈశ్వరి, కొమ్మినేని అనీష్‌ కుమార్‌ మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. మునిసిపల్‌ ఎన్నికల్లో బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించినట్లు ఫిర్యాదులు వస్తే స్వీకరించాలని రిటర్నింగ్‌ అధికారులను ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్‌ గత నెల 16న జారీ చేసిన ఉత్తర్వులను కూడా పిటిషనర్లు సవాలు చేశారు. ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అనుబంధ వ్యాజ్యాల్లో కోరారు. 

ఆ అధికారం కమిషన్‌కు లేదు...
‘ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని భావిస్తే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. నామినేషన్ల దాఖలు నుంచి ఫలితాల వెల్లడి వరకు వచ్చే ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్‌ విచారణ జరపడానికి వీలేదు. ఆ ఫిర్యాదులను ఎన్నికల పిటిషన్‌ ద్వారా మాత్రమే తేల్చాలి. నామినేషన్‌ దాఖలు చేయకుండా అడ్డుకున్నారని భావిస్తే సంబంధిత వ్యక్తులు ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలి. ప్రస్తుత కేసులో జారీ చేసినటువంటి ఉత్తర్వులు వెలువరించే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదు. చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో పిటిషనర్లు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నాం’ అని జస్టిస్‌ సోమయాజులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కమిషన్‌ జోక్యంపై స్పష్టమైన నిషేధం ఉంది
మోసం తదితర విషయాల్లో ఎన్నికల కమిషన్‌ వాదన ప్రశంసించదగ్గదే అయినా ఈ కేసులో న్యాయ క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రత్యామ్నాయ పరిష్కారం ఉన్నప్పుడు న్యాయస్థానాల జోక్యం తగదు. అందువల్ల ఈ కేసులో ఎన్నికల కమిషన్‌ వాదనతో ఏకీభవించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో చట్టంలో లేదని, అందువల్ల పరిస్థితులకు తగినట్లు అధికారాన్ని ఉపయోగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌ చెబుతోంది. మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణ నిబంధనలను జాగ్రత్తగా పరిశీలిస్తే నామినేషన్‌ దాఖలు మొదలు ఫలితాల వెల్లడి వరకు ఏవైనా అక్రమాలు జరిగితే ఫిర్యాదులను ఎన్నికల కమిషన్‌ విచారించడానికి వీల్లేదని, వాటిని ఎన్నికల ట్రిబ్యునల్‌ మాత్రమే విచారించాలన్న విషయం తేటతెల్లమవుతోంది’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

నలుగురే నామినేషన్లు వేశారు..
‘ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగితే ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యామ్నాయం ఉందన్న పిటిషనర్ల వాదనతో ఈ కోర్టు ఏకీభవిస్తోంది. హైదరాబాద్‌ మునిసిపల్‌ చట్టం సెక్షన్‌ 71 ప్రకారం ఎన్నికను ఎన్నికల పిటిషన్‌ ద్వారా మాత్రమే ప్రశ్నించగలుగుతారు. రాజ్యాంగంలోని అధికరణ 243 జెడ్‌జీ ఏ మునిసిపాలిటీ ఎన్నికనైనా ఎన్నికల పిటిషన్‌ ద్వారా తప్ప మరో రకంగా ప్రశ్నించజాలరని చెబుతోంది. ఒక చర్యను ఫలానా విధంగా చేపట్టాలని చట్టం చెబుతున్నప్పుడు ఆ విధంగానే చేపట్టాలే కానీ మరోరకంగా కాదు. మునిసిపల్‌ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, బెదిరింపులు చోటు చేసుకున్నాయని ఎన్నికల కమిషన్‌ చెబుతున్నప్పటికీ కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే తిరిగి నామినేషన్లు దాఖలు చేశారు.

ఈ పరిస్థితుల్లో పిటిషనర్లకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఎన్నికల్లో మోసం జరిగిందని చెబితే సరిపోదు, నిర్దిష్ట ఆధారాలను సమర్పించాలి. తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల విషయంలో రిటర్నింగ్‌ అధికారి జోక్యం చేసుకోవడానికి నిరాకరించారు. బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ జరిగిందనేందుకు స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే ఎన్నికల కమిషన్‌ దీన్ని తోసిపుచ్చింది. ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చినప్పుడు అందుకు కారణాలు తెలియచేయాలి. కానీ ప్రస్తుత కేసులో అలాంటి కారణాలు ఏవీ చెప్పలేదు’ అని జస్టిస్‌ సోమయాజులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

వలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తారనేందుకు ఆధారాల్లేవ్‌
మునిసిపల్‌ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకోకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపివేసింది. వార్డు వలంటీర్ల కార్యకలాపాలన్నింటినీ నిలిపేయాల్సిన అవసరం ఏమీ లేదని స్పష్టం చేసింది. మొబైల్‌ ఫోన్లలో డేటాను వలంటీర్లు దుర్వినియోగం చేస్తారనేందుకు స్పష్టమైన ఆధారాలు లేవని, ఓటర్లను ప్రభావితం చేస్తారనేందుకు సైతం ఆధారాల్లేవని హైకోర్టు తేల్చి చెప్పింది. ఒకవేళ బెదిరింపులు, ఒత్తిళ్లకు పాల్పడినా, ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినా చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జేసీ, వెలగపూడి దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాల్లో ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలను చట్ట విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ గ్రామ వలంటీర్, వార్డు వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయం శాఖ ముఖ్య కార్యదర్శి  అజయ్‌జైన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కమిషన్‌ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ అనుబంధ పిటిషన్‌ వేశారు. 

బెదిరించాలనుకుంటే.. ఫోన్లు లేకుండా కూడా చేయొచ్చు
‘వలంటీర్లు ఓటర్‌ స్లిప్పులు పంపిణీ చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని ఎన్నికల కమిషన్‌ చెబుతోంది. ఓటర్‌ స్లిప్పుల పంపిణీ విషయంలో 19.2.2021న పురపాలకశాఖ జారీ చేసిన సర్కులర్‌ చాలా స్పష్టంగా ఉంది. ఓటర్‌ స్లిప్పుల పంపిణీని బ్లాక్‌ లెవల్, అధీకృత ఉద్యోగులు మాత్రమే చేపట్టాలని అందులో పేర్కొన్నారు. ఫోన్లను జాగ్రత్తగా ఉంచకుంటే లబ్ధిదారుల వివరాలను వలంటీర్లు ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించే అవకాశం ఉందన్నది ఎన్నికల కమిషన్‌ ఆందోళన మాత్రమే. ఈ ఆధునిక యుగంలో సాంకేతికతను ఉపయోగించి మొబైల్‌ ఫోన్‌ లేకుండా కూడా డేటాను సంపాదించవచ్చు, దుర్వినియోగం కూడా చేయవచ్చు. మొబైల్‌ ఫోన్లలో డేటాను ఉపయోగించి ఫలానా వారికి ఓటు వేయకుంటే పథకాలు ఆపేస్తామని బెదిరించడం అన్నది వలంటీర్లు మొబైల్‌ ఫోన్లు లేకుండా కూడా చేయవచ్చు. వారిని విధులు నిర్వర్తించకుండా స్తంభింప చేయడం, మొబైల్‌ ఫోన్లను సీజ్‌ చేయడం చేయాలని చెప్పజాలం. ప్రజల మంచి కోసం వలంటీర్లను విధులు నిర్వర్తించడానికి అనుమతించాలని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది’ అని జస్టిస్‌ సోమయాజులు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top