భారీ విదేశీ పెట్టుబడులే లక్ష్యం! 25 దేశాలపై ఏపీ దృష్టి

Ap Govt Trying To Bringing In Foreign Investment - Sakshi

పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక కార్యాచరణ

అక్టోబర్‌ నుంచి వర్చువల్‌ లేదా డిప్లొమాటిక్‌ సదస్సులు

ఇప్పటికే 9 దేశాలతో రోడ్‌ షోల తేదీల ఖరారు  

సాక్షి, అమరావతి:రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి, వేలాది మందికి ఉపాధి కల్పించే దిశగా ఏపీ ప్రభుత్వం మరింత వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఏపీ ఈడీబీ) వివిధ దేశాల ప్రతినిధులతో చర్చలు జరపడం ద్వారా రూ. 34,813 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. వీటి ద్వారా 60వేల మందికిపైగా ఉపాధి లభించింది. తాజాగా రాష్ట్రంలో అవకాశాలను వివరిస్తూ విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా వర్చువల్‌గా రోడ్‌షోలు, డిప్లొమాటిక్‌ సమావేశాలు అక్టోబర్‌ నుంచి నిర్వహించడానికి ఏపీ ఈడీబీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే జపాన్, అమెరికా, తైవాన్, దక్షిణ కొరియా, ఇటలీ, మిడిల్‌ ఈస్ట్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కువైట్‌ వంటి దేశాల రాయబారులు, వ్యాపార సంఘాలతో సమావేశాలను ఏయే నెలల్లో నిర్వహించాలన్న దానిపై ఒక ప్రణాళికను రూపొందించింది. అక్టోబర్‌లో జపాన్, నవంబర్‌లో అమెరికా, డిసెంబర్‌లో తైవాన్, దక్షిణకొరియా దేశాల ప్రతినిధులతో చర్చలు జరగనున్నాయి. మిగిలిన దేశాలతో వచ్చే ఏడాది ప్రారంభంలోనే చర్చలు జరుగుతాయి. వీటితోపాటు మరో 16 దేశాలకు సంబంధించి సంప్రదింపులు జరుపుతోంది. మొత్తం 25 దేశాల్లో 30 వ్యాపార సంఘాలతో కలిసి రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను తెలియజేయనున్నట్లు ఏపీ ఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రమణ్యం సాక్షికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆథారిత ప్రయోజనాలు (పీఎల్‌ఐ) స్కీం కింద తయారీ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న తరుణంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి రంగాల వారీగా ఈడీబీ బృందాలను ఏర్పాటు చేసి కరోనా సమయంలోనూ వెబినార్‌ ద్వారా సమావేశాలను నిర్వహిస్తోంది. 

రెండేళ్లలో 110కి పైగా పెట్టుబడుల సదస్సులు 

అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే సీఎం జగన్‌ అధ్యక్షతన ఆగస్టు, 2019లో నిర్వహించిన డిప్లామాటిక్‌ ఔట్‌ రీచ్‌ సమావేశంలో 35కు పైగా దేశాలకు చెందిన రాయబారులు పాల్గొన్నారు. ఈ రెండేళ్లలో ఏపీఈడీబీ ఆధ్వర్యంలో 110కిపైగా పెట్టుబడి సదస్సులు, రాయబారులతో సమావేశాలు జరిగాయి. సీఎం జగన్‌ అమెరికా, ఇజ్రాయెల్‌ పర్యటనల సందర్భంగా ఆయా దేశాల వ్యాపార ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను స్వయంగా వివరించారు. 15కు పైగా సమావేశాల్లో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌ రెడ్డి పాల్గొనగా, 20కి పైగా రంగాల వారీగా రోడ్‌షోలు, 75కుపైగా సీఈవోలు, రాయబారులతో సమావేశాలు జరిగాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top