గత ప్రభుత్వ సంస్కరణల వల్లే ‘పది’లో ప్రభంజనం | AP Govt school Student High Scores in 10th results under Ys Jagan Govt | Sakshi
Sakshi News home page

గత ప్రభుత్వ సంస్కరణల వల్లే ‘పది’లో ప్రభంజనం

May 4 2026 3:28 AM | Updated on May 4 2026 3:33 AM

 AP Govt school Student High Scores in 10th results under Ys Jagan Govt

అన్ని వసతులతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అభివృద్ధి చేసిన కాకినాడ శ్రీనగర్‌లోని మున్సిపల్‌ బాలికోన్నత పాఠశాల

పదో తరగతి ఫలితాల్లో 596 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో సమకూరిన వసతులతో మెరుగైన ఫలితాలు  

నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు

అత్యాధునిక ల్యాబ్‌లు, డిజిటల్‌ బోర్డులు 

ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ, ఐబీ సిలబస్, ట్యాబ్‌లు 

గోరుముద్ద పేరుతో మధ్యాహ్నం రుచికరమైన భోజనం 

జగనన్న విద్యా కానుక కింద బ్యాగ్‌తో కూడిన పుస్తకాల కిట్‌

అమ్మ ఒడి కింద రూ.15 వేల చొప్పున విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ

ఫలితంగా పూర్తిగా చదువుపై దృష్టి పెట్టిన పిల్లలు, టీచర్లు

సాక్షి, నెట్‌వర్క్‌: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మెరిశారు. వైఎస్‌ జగన్‌ పాలనలో చేపట్టిన విద్యా సంస్కరణలు నేడు మంచి ఫలితాలనిస్తున్నాయి. నాడు–నేడు కార్యక్రమం వల్ల సమకూరిన మౌలిక వసతుల వల్ల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. పేదింటి బిడ్డలు వెలుగులు విరజిమ్మారు. 2014–19 మధ్య రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలంటే అందరికీ చిన్నచూపే. చిన్నపాటి వర్షానికే కారే భవనాలు.. కుక్కలు, పందులతో పాఠశాల ప్రాంగణాలు.. తెల్లగా మారిపోయిన బ్లాక్‌ బోర్డులు.. చివరకు చాక్‌పీస్‌లకూ కొరతే.. పిల్లలకు బెంచీలుండవు.. అయ్యవార్లకు కుర్చీలుండవు.. పిల్లలకు కనీసం తాగడానికి మంచినీరు దొరికేది కాదు.

అలాంటి దుస్థితిలో ఉన్న పాఠశాలలను 2019–24 మధ్య వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది. ఇదివరకెన్నడూ లేనివిధంగా వేల కోట్ల రూపాయలతో నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేసింది. సీబీఎస్‌ఈ స్కూళ్లు, ఇంగ్లిష్‌ మీడియం, టోఫెల్, ఐబీ సిలబస్, విద్యార్థులకు ట్యాబ్‌లు, పిల్లలకు మధ్యాహ్నం గోరుముద్ద పేరుతో రుచికరమైన భోజనం, జగనన్న విద్యాకానుక కింద యూనిఫాం, పుస్తకాలు, షూ, బెల్ట్, బ్యాగ్‌ తదితరాలన్నీ సమకూర్చింది.

వీటిన్నింటితో పాటు సకల సౌకర్యాలతో పాఠశాలలను తీర్చిదిద్దింది. అత్యాధునిక ల్యాబ్, లైబ్రరీ, ఫర్నిచర్, డెస్‌్కలు, డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ పానెల్స్, వాటర్‌ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు క్యూ కట్టారు. ఓ దశలో పలు పాఠశాలల్లో హౌస్‌ఫుల్‌ బోర్డులు పెట్టారు. వీటన్నింటికీ తోడు పిల్లలను బడులకు పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు అమ్మ ఒడి పేరిట తల్లుల ఖాతాల్లో జమ చేశారు. 

దశ తిరిగింది.. దిశ మారింది 
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ సంస్కరణల ఫలితంగా 2022 నుంచి ప్రభుత్వ పాఠశాలల స్వరూపమే మారిపోయింది. అప్పటివరకు పదో తరగతి ఫలితాల్లో గుత్తాధిపత్యం గల కార్పొరేట్‌ పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఫలితాలు రావడం మొదలైంది. దిగువ మధ్యతరగతి, పేదింటి పిల్లలు సైతం అత్యుత్తమ మార్కులు సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ప్రతి పాఠశాలలోనూ పిల్లలు మంచి మార్కులు సాధించారు.  పలువురు విద్యార్థులు 596 మార్కులు సాధించారంటే ఇందుకు కారణం గత ప్రభుత్వ సంస్కరణలే అని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెబుతున్నారు.  

ట్యాబుల వల్లే మంచి మార్కులు సాధించా.. 
నాన్న శ్రీనివాసరావు గ్యాస్‌ డెలివరీ చేస్తారు. అమ్మ వెంకట అనంతలక్ష్మి గృహిణి. అమ్మ బీకామ్‌ చదివింది. క్లాస్‌లో టాప్‌లో ఉండాలని చెబుతుంటారు. జగన్‌ ప్రభుత్వంలో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్‌ (ఐఎఫ్‌పీ)లు వచ్చిన తరువాత మాకు ల్యాబ్‌ లేదన్న కొరత తీరింది. పాఠాలు చెప్పడం, వెంటనే వీడియోలో ప్లే చేయడం, ట్యాబ్‌లలో స్లిప్‌ టెస్టులు, స్పెషల్‌ టెస్టులు పెట్టేవారు. ఐఎఫ్‌పీలు, ట్యాబ్‌ల వల్ల మాకు క్విక్‌ రివిజన్‌ అయ్యేది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన నాడు–నేడు, నూతన విద్యావిధానం మాకెంతో ఉపయోగపడింది.

 

మంచి బోధనా వసతులే కారణం
నాన్న కోలా కులశేఖర్‌. అమ్మ సరోజమ్మ. మాది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులకు భారం కాకూడదని నాగలగుట్టపల్లె జెడ్పీ హైసూ్కల్‌లో చదివా. పదో తరగతిలో 595 మార్కులు సాధించా. ఉన్నత చదువులకు పేదరికం, ఆరి్థక సమçస్య అడ్డు గోడగా ఉంటోంది. కష్టపడి చదివి తొలుత డాక్టర్‌ వృత్తి చేపడతా. సివిల్స్‌కు ప్రిపేర్‌ అయి కలెక్టర్‌ అవుతా. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలలో కల్పించిన మంచి బోధనా వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం బాగా చదవడానికి దోహదపడింది. నాడు–నేడు పథకంలో ప్రతి తరగతి గదికి ఇచ్చిన ఐఎఫ్‌పీ ప్యానల్‌ బోర్డు ద్వారా  కల్పించిన విద్యాబోదన కూడా విజయానికి దోహదపడింది.

 

గత ప్రభుత్వం వల్లే అధిక మార్కులు
టెన్త్‌లో 600 మార్కులకు 595 మార్కులతో టాపర్‌గా నిలిచాను. మా పాఠశాలను గత ప్రభుత్వం ‘నాడు–నేడు’లో అన్నివిధాలుగా అభివృద్ధి చేసింది. మా స్కూల్‌లో ప్రశాంత వాతావరణం కల్పించడంతో చదువుపై దృష్టి పెట్టాను. డిజిటల్‌ తరగతి గదులు, అత్యంత ఆధునికత ఉట్టిపడేలా టేబుళ్లు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, స్వచ్ఛమైన మినరల్‌ వాటర్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్పొరేట్‌ స్కూళ్లలో లక్షలు ఖర్చు చేస్తే కానీ చదవలేం. కానీ ప్రభుత్వ పాఠశాలలోనే కార్పొరేట్‌ వసతులు కల్పించారు. మా వంటి పేద విద్యార్థులకు ఇంతకంటే ఏం కావాలి. నాన్న రవికిశోర్‌ అకౌంటెంట్‌. అమ్మ ఉషారాణి గృహిణి. టీచర్‌ కావాలన్నదే నా ఆశయం. 

 

‘సాక్షి’ మెటీరియల్‌ అద్భుతం 
మాది వ్యవసాయ ఆధారిత మధ్య తరగతి కుటుంబం. నాన్న కొర్రకూటి వెంకటేశ్వర్లు. అమ్మ లక్ష్మి గృహిణి. ఆరి్థక స్తోమత లేని కారణంగా ఊళ్లోని ప్రభుత్వ పాఠశాలలో చదివించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థలో తెచ్చిన పటిష్టమైన విద్యా ప్రమాణాలే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. టెన్త్‌లో 600 మార్కులకు గాను 595 మార్కులొచ్చాయి. జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌ నా చదువుకు ఎంతో దోహదపడింది. ఉపాధ్యాయుల బోధనతో పాటు ‘సాక్షి’ మీడియా అందించిన స్టడీ మెటీరియల్‌ కూడా మంచి మార్కులు సాధించేందుకు సహకరించింది. సివిల్స్‌ సాధనే లక్ష్యంగా ఎంచుకున్నాను.

 

వైఎస్‌ జగన్‌ ఉజ్వల భవితకు బాట వేశారు
నాన్న హరిప్రసాద్‌కు వ్యవసాయమే ప్రపంచం. సాధారణ గృహిణి అయిన అమ్మ రాజ్యలక్షి్మకి ఇల్లే ప్రపంచం. ఆకలి బాధతో చదువుకునే విద్యార్థులు మెరుగైన లక్ష్యాలను అందుకోలేరన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో ఎన్నో మార్పులు తెచ్చింది. ఎంతోమంది విద్యార్థుల ఆకలి బాధను పౌష్టికాహారంతో తీర్చి మంచి మార్కులతో ఉజ్వల భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేలా బాటలు వేసింది. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి 596 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ర్యాంక్‌ సాధించడానికి గత ప్రభుత్వ విధానాలే బాటలు వేశాయి. 4వ తరగతి వరకు కొల్లూరులోని ప్రైవేట్‌ స్కూల్‌లో చదివాను. ఐఐఐటీ పూర్తి చేసి సివిల్స్‌ సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నా.  

జగన్‌ ప్రభుత్వం ముందు చూపు వల్లే..
నాన్న దూళ్ల శ్రీనివాస్‌ వ్యవసాయ పనులకు వెళ్తారు. అమ్మ వీరవేణి గృహిణి. మాది మధ్యతరగతి కుటుంబం. నేను టెన్త్‌ ఫలితాల్లో 600 మార్కులకు 596 మార్కులు సాధించి స్టేట్‌ టాపర్‌గా నిలిచాను. దీనికి ప్రధాన కారణం నాటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పాఠశాలలను ‘నాడు–నేడు’లో అభివృద్ధి చేయడమే. చక్కటి అదనపు తరగతి గదులు, డిజిటల్‌ తరగతులు, ట్యాబ్‌లు, ఫుట్‌పాత్, చక్కటి మొక్కలు, సమావేశపు ప్రాంగణం, టేబుల్స్‌ వంటి మౌలిక వసతులతో సంపర జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణం కల్పించారు. పాఠశాలను అత్యంత ఆధునిక వసతులతో తీర్చిదిద్దడంతో బాగా చదవుకోగలిగాను. పాఠశాలలో కల్పించిన ఆధునిక వసతులు ఎంతో ప్రేరణగా నిలిచాయి. మా చెల్లి కూడా ఇదే పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. భవిష్యత్‌లో సీఏ చదవాలనుకుంటున్నాను.

  

నాడు–నేడు నా జీవితాన్నే మార్చింది 
నాన్న చక్రపాణి ఓ ప్రైవేట్‌ కాలేజీలో లెక్చరర్‌. అమ్మ పద్మావతి గృహిణి. నేను పాణ్యం మండలం నెరవాడ గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకున్నా. టెన్త్‌లో 596 మార్కులు సాధించి స్టేట్‌ టాపర్‌గా నిలవడానికి కారణం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు–నేడు కార్యక్రమం. ఇది ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేసింది. ఐదో తరగతిలో చేరినప్పుడు పాఠశాలలో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండేవి. కిందనే కూర్చుని పాఠాలు వినేవాళ్లం. విద్యుత్‌ సౌకర్యం ఉండేది కాదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మంచి టేబుల్స్, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, మరుగుదొడ్లు, ఫర్నిచర్‌ లాంటి సదుపాయాలు ఏర్పాటు చేసింది. డిజిటల్‌ విద్య అందుబాటులోకి వచ్చింది. ఐఎఫ్‌బీ ప్యానెల్‌ ఏర్పాటు చేసి వాటి ద్వారానే ఉపాధ్యాయులు బోధన చేసేవారు. 8వ తరగతిలో ట్యాబులు ఇచ్చారు. వీటిద్వారా ఎప్పటికప్పుడు సబ్జెక్టులలో వచ్చే అనుమానాలు నివృత్తి చేసుకునే దాన్ని. భవిష్యత్‌లో గైనకాలజిస్ట్‌ కావాలనుకుంటున్నాను.

 

నాడు– నేడుతో బడి బాగు
గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌ అనుసరించిన విధానాలతో మా ఊరితోపాటు పాఠశాల బాగు పడింది. విద్యార్థులకు అమ్మ ఒడి, విద్యార్థులకు ట్యాబ్స్‌ ఇవ్వడంతోపాటు నాడు–నేడు పథకంలో మా పాఠశాలని కూడా బాగుచేయడం ఎంతో నచ్చింది. ఐఎఫ్‌పీలు, ట్యాబ్‌ల వల్ల మాకు క్విక్‌ రివిజన్‌ అయ్యేది. దీనివల్ల ఒత్తిడి ఉండేది కాదు. దీనివల్ల మేం ముందుకు సాగాం. చదివింది, విన్నది, చూసినది అన్నీ చక్కగా గుర్తుపెట్టుకోగలిగాను. 10వ తరగతి పరీక్షల్లో కంగారు లేకుండా బాగా రాయటానికి ఇవన్నీ దోహదపడ్డాయి. మొత్తంగా టెన్త్‌లో 596 మార్కులు సాధించి స్టేట్‌ టాపర్‌గా నిలబడటానికి గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ విధానాలే కారణం. నాన్న వెంకట దుర్గారావు పెయింటింగ్‌ వర్కర్‌. తల్లి నాగలక్ష్మి బీఏ, బీఈడీ చేసి గృహిణిగా స్థిరపడ్డారు. యూపీఎస్‌సీలో మంచి ర్యాంకు సాధించడమే నా గోల్‌.  

 

వైఎస్‌ జగన్‌ హయాంలోనే కొత్త భవనాలు 
మాది పీలేరు. నాన్న ఆర్‌డీ మునిరాజ్‌ కడపలోని జగదీశ్వర ఇండేన్‌ గ్యాస్‌ ఏజెన్సీలో మేనేజర్‌. అమ్మ శైలజ గృహిణి. నేను 5వ తరగతి వరకు మదనపల్లె విజయభారతి ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో చదివా. తరువాత జెడ్పీ హైసూ్కల్‌లో చేరా. టెన్త్‌లో 595 మార్కులు సాధించా. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో కొత్త భవనాలు వచ్చాయి. డిజిటల్‌ బోర్డులపై విద్యాబోధన కూడా చాలా బాగా అర్థమైంది.

అప్పటి ప్రభుత్వం అందించిన ట్యాబ్‌లు చాలా అద్భుతంగా ఉపయోగపడ్డాయి. పాఠశాల రూపురేఖలు కూడా మార్చేశారు.  చూస్తే బిల్డింగ్‌లతోపాటు వివిధ రంగులలో ఉన్న బెంచీలు, ఇతర పరిసరాలు బాగా ఉన్నాయి. అప్పట్లో మాకు ఇచ్చిన అన్ని వస్తువులు బాగా ఉపయోగపడ్డాయి. మాకున్న లాంగ్వేజ్‌లతోపాటు మిగతా సబ్జెక్టులు ఏవీ కష్టంగా భావించలేదు.  ఇంటర్‌లో ఎంపీసీ తీసుకుని ఐఐటీ సాధన దిశగా ముందుకెళ్లాలని నిశ్చయించుకున్నా.

 

డిజిటల్‌ విద్యతో ఉత్తమ ఫలితాలు 
గత ప్రభుత్వం ‘నాడు–నేడు’ పథకంలో భాగంగా కాకినాడ శ్రీనగర్‌లో ఉన్నత పాఠశాలలో ప్రవేశపెట్టిన డిజిటల్‌ విద్య పదో తరగతి పరీక్షల్లో 595 మార్కులు సాధించేందుకు ఎంతగానో దోహదపడింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉండగా 2023లో డిజిటల్‌ తరగతులు ఏర్పాటు చేశారు. డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేయడమే కాకుండా విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు కూడా ఇచ్చారు. 

సాంకేతికతను అందిపుచ్చుకుని ఉత్తమ ఫలితాలు సాధించాను. సుద్ద ముక్కలు, బ్లాక్‌ బోర్డులు అవసరం లేకుండా మా పాఠశాలలో జరిగిన డిజిటల్‌ బోధన, కార్పొరేట్‌ పాఠశాలల్లో లేనివిధంగా ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్‌ డిస్‌ప్లేలను ‘నాడు–నేడు’లో ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయడం కలిసొచ్చింది. మా నాన్న రామలింగరాజు ప్రైవేట్‌ ఉద్యోగి. తల్లి శ్వేత గృహిణి. వారిద్దరూ నాకెంతో స్ఫూర్తిని కలిగించారు. ఇంటర్‌లో ఎంఈసీ గ్రూపు తీసుకుని చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా స్థిరపడాలనేది నా ఆశయం.

 

ప్యానల్స్‌ బాగా ఉపయోగపడ్డాయి 
టెన్త్‌లో 595 మార్కులు రావడం చాలా సంతోషంగా ఉంది. నాన్న బ్రహా్మనందం చిన్న షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అమ్మ సౌజన్య గృహిణి. వైఎస్‌ జగన్‌ హయాంలో నాడు–నేడు పథకాన్ని మా పాఠశాలలో బాగా అమలు చేశారు. తరగతి గదులలో టైల్స్‌ వేశారు. ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్‌ (ఐఎఫ్‌పీ)ల ద్వారా విద్యాబోధన మరింత మేలు చేసింది. పాఠాలు వినడంతో పాటు వీడియోలు కూడా చూడటం వల్ల మాకు మరింతగా అర్థమయ్యాయి. ట్యాబ్‌లు అందుబాటులో ఉండటం వల్ల మాకు తరచూ స్లిప్‌ టెస్టులు నిర్వహించారు. ఈ కారణంగానే మాకు మంచి మార్కులు వచ్చాయి. భవిష్యత్‌లో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చేస్తాను.


 

Advertisement
 
Advertisement
Advertisement