పోలవరం: తప్పుడు ప్రచారాలపై సీఎం జగన్‌ ఆగ్రహం

AP CM YS Jagan Mohan Reddy Polavaram Visit December 14th - Sakshi

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తాం: సీఎం జగన్‌

సాక్షి, పశ్చిమ గోదావరి:  పోలవరం ప్రాజెక్టు అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష ముగిసింది. అంతకుముందు పోలవరం పర్యటనలో భాగంగా తొలుత ఏరియల్‌ వ్యూ ద్వారా ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను సీఎం జగన్‌ పరిశీలించారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును శరవేగంగా సాకారం చేసి రాష్ట్ర ప్రజలకు  ఫలాలను అందచేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న సీఎం జగన్..‌ పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి గడువులోగా పూర్తి చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ప్రాజెక్టు అధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ..  2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరందించేలా పనులు పూర్తి చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎల్ లెవల్‌ 45.72 మీటర్లు ఉంటుందని తెలిపారు. టాప్ ఆఫ్‌ మెయిన్ డ్యాం లెవల్‌ 55 మీటర్లు ఉంటుందని సీఎం జగన్‌ అన్నారు. డ్యామ్‌తో పాటు అదే వేగంతో పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక పరమైన అంశాలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. నిర్వాసితులకు న్యాయం చేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. మే నెలాఖరు నాటికి స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్ పనులు పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. సీఎం వెంట మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు. స్పిల్‌వే వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని వారు పరిశీలించారు. అనంతరం కాఫర్ డ్యాం వద్దకు చేరుకొని.. కాఫర్ డ్యాం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి జగన్‌ పరిశీలించారు. 
(చదవండి: వడివడిగా జీవనాడి)


అంతకు ముందు హెలికాఫ్టర్‌లో పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు హెలిప్యాడ్ వద్ద మంత్రులు ఘన స్వాగతం పలికారు. ప్రాజెక్ట్‌ పనుల పరిశీలనలో సీఎంతో పాటు మంత్రులు ఆళ్లనాని, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ష, చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ఎంపీ మార్గని భరత్, రాజ్యసభ సభ్యులు పిల్లిసుభాష్ చంద్రబోష్, కలెక్టర్లు రేవు ముత్యాల రాజు, మురళీధర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, రాపాకవరప్రసాద్, పుప్పాలవాసుబాబు, తల్లారి వెంకట్రావు, ముదునూరి ప్రసాదరాజు, ఏలూరు రేంజ్ డిఐజీ మోహనరావు, జిల్లా ఎస్పి నారాయణ నాయక్‌లు పాల్గొననున్నారు. ఉదయం 11.50 నుంచి పోలవరం పనుల పురోగతిపై సమీక్షించిన  సీఎం మరికొద్దిసేపట్లో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి బయల్దేరనున్నారు.
(చదవండి: కరోనా సెకండ్‌ వేవ్‌: ఇప్పట్లో ఇల్లు కదలక్కర్లేదు!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top