AP Budget 2021: మహిళా సాధికారతకు పెద్ద పీట

AP Assembly Budget Session 2021 Allotments For Women Empowerment - Sakshi

సాక్షి, అమరావతి: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2021 ఏడాదికి గాను బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. మహిళా సాధికారతకు బడ్టెట్‌లో పెద్ద పీట వేశారు. ఇందుకోసం రూపొందించిన వైఎస్‌ఆర్‌ ఆసరా, సున్నా వడ్డీ, చేయూత పథకాలకు కేటాయింపులు చేశారు. 

వైఎస్‌ఆర్‌ ఆసరా..
మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కలగజేయడం కోసం.. అప్పుల ఊబి నుంచి బయటపడేయటం కోసం ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం ద్వారా 2019, ఏప్రిల్‌ 11 నాటికి ఉన్న 27,168 కోట్ల రూపాయల బ్యాంకు బకాయిల్లో.. మొదటి విడతగా 2020 సెప్టెంబర్‌ 11న 6,337 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రెండవ విడతలో భాగంగా 2021-22 ఏడాదికి గాను మరో 6,337 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ
ఏపీ ప్రభుత్వం 2020 ఏప్రిల్‌ 24 వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా 2019-20 సంవత్సారానికి చెందిన రుణాలపై వడ్డీకి సంబంధించి 1400 కోట్ల రూపాయలను బదిలీ చేయడం జరిగింది. మొదటి విడతలో భాగంగా ఏప్రిల్‌ 2021లో ఈ పథకానికి 1,112 కోట్ల రూపాయలు విడుదల చేయగా.. 2021-22కు గాను మరో 1,112 కోట్ల రూపాయలను కేటాయించింది. 

వైఎస్‌ఆర్‌ చేయూత
మహిళా సాధికారిత కోసం ప్రభుత్వం 2020 ఆగస్టు 12న వైఎస్‌ఆర్‌ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 45-60 ఏళ్ల లోపు షెడ్యూల్డ్‌ కులాల, తెగల, వెనకబడిన తరగతుల, అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన 23 లక్షల 76 వేల మహిళా లబ్దిదారులకు 4,455 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. రెండో విడతలో భాగంగా 2021-22కు గాను మరో 4,455 కోట్లు కేటాయించింది.  

చదవండి: AP Budget 2021: కోవిడ్‌పై పోరుకు రూ.1000 కోట్లు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top