అంధుల క్రికెట్‌ కాంతిరేఖ

Andhra Pradesh Womens Blind Cricket Team for national competitions - Sakshi

వెలుగుదివ్వె తాహెరా ట్రస్టు 

ఏపీ మహిళా అంధ క్రికెట్‌ జట్టుకు అండ  

జాతీయస్థాయి పోటీలకు తొలిసారి ఏపీ టీం 

తెనాలి: బెంగళూరులో ఈనెల 28 నుంచి జరగనున్న జాతీయ అంధ మహిళల క్రికెట్‌ టోర్నమెంటులో ఆంధ్రప్రదేశ్‌ జట్టు తొలిసారిగా ప్రాతినిథ్యం వహించనుంది. గుంటూరు జిల్లాకు చెందిన తాహెరా ట్రస్ట్‌ దీనికి మార్గం సుగమం చేసింది. తొలి విమెన్స్‌ నేషనల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఫర్‌ బ్‌లైండ్‌–2019 ఢిల్లీలో జరిగింది. టీ–20 ఫార్మట్‌లో జరిగిన ఈ టోర్నీలో వివిధ జిల్లాల నుంచి క్రీడాకారుల ప్రాతినిథ్యం ఉన్నా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి జట్టు పాల్గొనలేదు. ఆంధ్రప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఫర్‌ బ్‌లైండ్‌ (సీఏబీఏపీ)కి నిధుల కొరత, స్పాన్సర్లు లేకపోవడమే దీనికి కారణం.  ఇప్పటికే మెన్‌ బ్‌లైండ్‌ క్రికెట్‌లో ఏపీ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొంటున్నారు. ఇండియా జట్టు వరల్డ్‌ కప్‌నూ సాధించింది. 

ముందుకొచ్చిన జహరాబేగం
అంధ మహిళల విభాగంలో క్రికెట్‌ పోటీల ఆరంభంతో గత రెండేళ్లుగా సాధన చేసేవారి సంఖ్య పెరిగింది. అయినా మహిళల జట్టు ఎంపిక లేక నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన తాహెరా ట్రస్ట్‌ వ్యవస్థాపకురాలు, ఎన్నారై జహరాబేగంకు క్రీడాకారులు సమాచారం పంపారు. గతంలో బ్‌లైండ్‌ మెన్‌ వరల్డ్‌ కప్‌ టోర్నమెంటులో హైదరాబాద్, మూలపాడుల్లో జరిగిన రెండు మ్యాచ్‌లకు తాహెరా ట్రస్ట్‌ స్పాన్సర్‌ చేసింది. గతేడాది జాతీయ పోటీల్లో పాల్గొన్న ఏపీ మెన్‌ బ్‌లైండ్‌ టీమ్‌కు స్పాన్సర్‌గానూ వ్యవహరించింది. ఈ క్రమంలో ఏపీ నుంచి అంధ మహిళల జట్టును జాతీయ పోటీలకు పంపేందుకు తోడ్పడాలని క్రీడాకారుల నుంచి వచ్చిన వినతులను జహరాబేగం పరిగణనలోకి తీసుకున్నారు. ఏపీ జట్టుకు స్పాన్సర్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. 

సీఏబీఏపీ చురుగ్గా ఏర్పాట్లు 
తాహెరా ట్రస్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌తో ఆంధ్రప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఫర్‌ బ్‌లైండ్‌ (సీఏబీఏపీ) చురుగ్గా ఏర్పాట్లు చేసింది. అనంతపురంలోని పోలీస్‌ ట్రైనింగ్‌ గ్రౌండ్‌లో క్రీడాకారులకు సన్నాహక శిబిరం చేపట్టింది. ఈనెల 15 నుంచి ఇది ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 35 మంది క్రీడాకారులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. జహరా బేగం సన్నాహక శిబిరానికి హాజరై, క్రీడాకారిణులకు వసతి, భోజనం, యూనిఫాం, కిట్‌ను సమకూర్చారు. వీరి నుంచి 14 మంది జట్టును ఈనెల 17న ఎంపిక చేశారు. మళ్లీ వీరికి పూర్తిస్థాయి శిక్షణ నడుస్తోంది. క్రికెట్‌ అసోసియేషన్‌ ఫర్‌ బ్‌లైండ్‌ ఇన్‌ ఇండియా కార్యదర్శి, ఏపీ అధ్యక్షుడు జాన్‌ డేవిడ్‌ నేతృత్వంలో జాతీయ క్రీడాకారుడు జి.వెంకటేష్‌ వీరికి శిక్షణనిస్తున్నారు. రాయలసీమ కో–ఆర్డినేటర్‌ ఫర్‌ బ్‌లైండ్‌ వెంకటనారాయణ పర్యవేక్షిస్తున్నారు. 

త్వరలో సీఎం వద్దకు.. 
అంధ క్రీడాకారుల్లో క్రీడాపరంగా అపూర్వమైన సామర్థ్యం ఉందని జహరాబేగం చెప్పారు. క్రికెట్‌ సాధనకు క్రీడాకారులకు తగిన ఆటస్థలం, వసతిగృహం అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని త్వరలోనే కలవనున్నట్టు చెప్పారు. క్రీడాకారుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్టు వివరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top