AP: వలంటీర్‌ మారినా ఫోన్‌ నంబర్‌ మారదు

Andhra Pradesh: Phone Number Does Not Change Even if Volunteer Changes - Sakshi

సాక్షి, అమరావతి: ఏదైనా కారణంతో వలంటీర్‌ మారినా.. సమాచారం విషయంలో ఆ క్లస్టర్‌ పరిధిలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామాలు, పట్టణాలు, నగర కార్పొరేషన్లలో క్లస్టర్‌ వారీగా శాశ్వత ఫోన్‌ నంబర్‌ను కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో వలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడే ప్రభుత్వం ప్రతి వలంటీర్‌కు మొబైల్‌ ఫోన్‌తో పాటు సిమ్‌ను కూడా అందజేసింది. 

అయితే ఏ కారణంతోనైనా ఏదైనా ప్రాంతంలో వలంటీర్‌ విధుల నుంచి తప్పుకొని తనకు కేటాయించిన ఫోన్‌ నంబర్‌ తిరిగి ఇవ్వనప్పుడు ఆ క్లస్టర్‌ పరిధిలోని ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బంది ఇకపై తలెత్తకుండా విధుల నుంచి తప్పుకొన్న వలంటీర్‌కు కేటాయించిన సిమ్‌ను బ్లాక్‌ చేసి, అదే నంబర్‌తో కొత్త సిమ్‌ తీసుకొని కొత్త వలంటీర్‌కు అధికారులు అందజేయనున్నారు. ఇందుకోసం వలంటీర్లకు ప్రభుత్వం కేటాయించిన ఫోను నంబర్ల వివరాలను రాష్ట్ర స్థాయి ఆన్‌లైన్‌ డేటా బేస్‌ సెంటర్‌లో నమోదు చేస్తున్నారు. 

ఈ నెల పదో తేదీ కల్లా ప్రతి వలంటీర్‌ తమ మొబైల్‌ నంబర్‌ వివరాలతో పాటు సిమ్‌ కార్డు వివరాలు రాష్ట్ర స్థాయి డేటా బేస్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా సరైన సిగ్నల్‌ లేక ప్రభుత్వం కేటాయించిన సిమ్‌ కాకుండా వలంటీర్లు తమ సొంత ఫోన్‌ నంబర్‌ వాడుతుంటే.. అలాంటి చోట్ల సరైన సిగ్నల్‌ ఉండే కంపెనీలకు చెందిన ఫోన్‌ నంబర్లనే వలంటీర్లకు కేటాయించేందుకు చర్యలు చేపట్టారు. (క్లిక్ చేయండి: వైద్య శాఖలో కొలువుల జాతర)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top