వాహనం ఆపి తలుపు తీస్తుండగా.. 115 కిలో మీటర్ల వేగంతో వచ్చిన కారు..

Andhra Pradesh: One Person Deceased Several Injured As Two Cars Collide - Sakshi

సాక్షి, నందిగాం( కృష్ణాజిల్లా): రెప్పపాటులో ఘోరం జరిగింది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగ్రహారానికి చెందిన నెయ్యల ఇంద్రతనయ  టాటా మ్యాజిక్‌ వాహనాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు.

రెప్పపాటులో విషాదం..
శనివారం టెక్కలిలో జడ్యాడకు చెందిన బలిగాం ముఖలింగం, సింగుపురం గ్రామానికి చెందిన తాడి దివాకర్, పట్నాన గాయిత్రి, పలాసకు చెందిన మరో ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకొని పలాస వెళ్తున్నాడు. మార్గమధ్యంలో పెద్దలవునిపల్లి వద్ద ఉన్న ముగ్గరు ప్రయాణికులను ఎక్కించుకోవడానికి రోడ్డుపక్కన ఆపి కిందకు దిగి తలుపు తీస్తుండగా.. మితిమీరిన వేగంతో వచ్చిన ఒడిశాకు చెందిన కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. టాటా మ్యాజిక్‌ బోల్తా పడగా.. కారు పల్టీలు కొడుతూ దూరంగా పడిపోయింది. దీంతో కారు ముందు సీటులో ఎడమ వైపు కూర్చోని ఉన్న వినోద్‌ (39) అక్కడికకక్కడే మృతి చెందగా, వెనుక సీటులో ఉన్న కె.లోకేష్‌ తీవ్రంగా, భగవాన్‌రెడ్డి, డ్రైవర్‌ హేమంత్‌నాయక్‌లకు స్వల్ప గాయాలయ్యాయి.

అలాగే టాటా మ్యాజిక్‌లోని బలిగాం ముఖలింగం (61)కు తీవ్రగాయాలు కాగా, తాడి దివాకర్‌ (45), పట్నాన గాయిత్రి (19), మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఒడిశాలోని బరంపురం పట్టణానికి చెందిన వారు గుండె వ్యా«ధితో బాధపడుతున్న వారిని విశాఖపట్నం కేర్‌ ఆస్పత్రిలో చూపించారు. రెండు కార్లలో ఎనిమిది మంది బయలుదేరి ఆస్పత్రిలో చూపించి తిరిగి బరంపురం వెళ్తుండగా ఒక కారుకు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో 115 కిలోమీటర్ల వేగంతో కారు ప్రయాణిస్తున్నట్లు డిజిటల్‌ మీటర్‌ చూపించింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న కాశీబుగ్గ రూరల్‌ సీఐ దుక్క రాము, నందిగాం ఎస్సై బాలరాజు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను, మృతదేహాన్ని 108 వాహనంలో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top