అనంతపురం ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై అట్రాసిటీ కేసు నమోదు

Anantapur Police Files Case on SP, ASP, DSP - Sakshi

సాక్షి, అనంతపురం: సాక్షాత్తు జిల్లా ఎస్పీపైనే అనంతపురం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. డిస్మిస్‌ అయిన కానిస్టేబుల్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ ఫిర్యాదు ఆధారంగా ఎస్పీ ఫక్కీరప్ప, ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్‌భాషాలపై అనంతపురం టూటౌన్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

వాస్తవానికి ప్రకాష్‌ను రెండు రోజుల క్రితమే ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్నేళ్లలో 5 క్రిమినల్‌ కేసులు కానిస్టేబుల్‌ ప్రకాష్‌పై నమోదయ్యాయి. మహిళలపై వేధింపులు, దాడి, అక్రమ ఆయుధాల సరఫరా వంటి కేసులు ఉన్నాయి. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఓ మహిళను లొబర్చుకొని ఆమె నుంచి రూ.10లక్షల నగదు, 30 తులాల బంగారు కాజేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రకాష్‌పై డిపార్ట్‌మెంట్‌ ఎంక్వైరీ చేశారు. ఆరోపణలు నిజమని తేలడంతో కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను డిస్మిస్‌ చేస్తూ అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాలు జారీ చేశారు.

చదవండి: (పోలీసులపై తప్పుడు కథనాలు.. ఈనాడుకు ఎస్పీ ఫకీరప్ప నోటీసులు)

డిస్మిస్‌ వెనుక కక్ష సాధింపు ఉందని ఎల్లో మీడియా ద్వారా ప్రకాష్‌ అసత్య ప్రచారం చేశాడు. సీఎం జగన్‌ చెన్నేకొత్తపల్లి పర్యటన సమయంలో ప్రకాష్‌.. ఎస్పీ ఆపీస్‌ సేవ్‌ ఏపీ పోలీస్‌ అంటూ ప్లకార్డుతో నిరసన వ్యక్తం చేశాడు. అందుకే ప్రకాష్‌ను సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేశారంటూ ఎల్లోమీడియాలో కథనాలు వచ్చాయి. వీటిని కొట్టిపారేసిన ఎస్పీ ఫక్కీరప్ప ప్రకాష్‌ ప్రవర్తన బాగాలేకపోవడంతో డిస్మిస్‌ చేసినట్లు స్పష్టం చేశారు.

అయితే కక్ష సాధింపుతోనే డిస్మిస్‌ చేశారని ప్రకాష్‌ ఆరోపించారు. ఎస్పీతో పలువురు పోలీస్‌ ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప, ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్‌భాషాలపై అనంతపురం టూటౌన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు విచారణ బాధ్యతలను డిఐజీ రవిప్రకాస్‌ చూస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top