AP: సేంద్రియ ‘చిరు’నామాగా ఏపీ!

Agriculture Department Give Awareness To Increase Millets Farming In AP - Sakshi

చిరు ధాన్యాలతో ఆరోగ్యం

ప్రజలకు అవగాహన కల్పించనున్న వ్యవసాయ శాఖ 

సేంద్రియ పద్ధతిలో సాగు చేయించేందుకు చర్యలు

రెండేళ్లలో పంటల విస్తీర్ణాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం  

సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని ఆరోగ్యకర ఆహార పదార్థాల చిరునామాగా తీర్చిదిద్దేందుకు మరిన్ని ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనిలో భాగంగా పోషకాలు ఎక్కువగా ఉండే చిరు ధాన్యాలను సేంద్రియ పద్ధతిన సాగు చేసి.. ప్రజల ఆరోగ్య స్థితిగతుల్లో పెద్ద ఎత్తున మార్పులు తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. పోషకాహార లోపాలను అధిగమించేలా బయోఫోర్టిఫైడ్‌ ఫుడ్స్‌(ఖనిజాలు, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహార ఉత్పత్తులు)ను ప్రోత్సహించాలని నిర్ణయించాయి. 2023ను ఐక్యరాజ్య సమితి చిరు ధాన్యాల సంవత్సరంగా పాటించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రియ పోషకాహార ఉత్పత్తుల పెంపుదలకు ప్రాధాన్యమిస్తున్నాయి.

రోజువారీ ఆహారంలో సంప్రదాయ ఆహార పదార్థాలకు చోటుండేలా ప్రజలకు వ్యవసాయాదికారులు అవగాహన కల్పిస్తారు. సంప్రదాయ సేంద్రియ ఉత్పత్తుల తయారీని చేపట్టి.. నెట్‌వర్కింగ్‌ సంస్థల ద్వారా ప్రజలకు అందిస్తారు. సూక్ష్మ పోషకాలైన ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, విటమిన్‌ బి12 ఉన్న ఫోర్టిఫైడ్‌ సూక్ష్మపోషకాలను కలిపి ఆహారంగా తీసుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 5 లక్షల ఎకరాల్లో చిరు ధాన్యాలు సాగవుతున్నాయి. వచ్చే మూడేళ్లలో దీన్ని రెట్టింపు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

ఉత్పత్తి పెంచేందుకు చర్యలు..
ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు, కొత్తగా నీటి పారుదల వసతి కల్పించేందుకు ప్రణాళికల రూపకల్పన  
► సమతుల ఎరువుల వాడకంతో భూసారాన్ని పెంచేలా చేయడం
► వ్యవసాయ ఉత్పత్తులు పొలాల్లోంచే మార్కెట్లకు చేరేలా అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేయడం
► ఆకలి, దారిద్య్ర్‌ం లేని ఆరోగ్యకర సమాజాన్ని తయారు చేసేలా వ్యవసాయ శాఖలు ఇతర ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేస్తాయి.  
► ఇలాంటి చర్యలతో రానున్న కాలంలో ఆహార ధాన్యాలు.. ప్రత్యేకించి చిరుధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంది. 
► సుస్థిర వ్యవసాయం, సేంద్రియ సాగు కోసం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న ‘ప్రతి నీటి చుక్కకూ అదనపు పంట’ ‘పరంపరాగత్‌ కృషీ వికాస్‌ యోజన’ విజయవంతంగా అమలయ్యేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపడుతుంది.
► చిరుధాన్యాల్లో కొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మద్దతు ధర ఇస్తోంది. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలనూ ప్రవేశపెట్టింది.  
► ఉత్పాదకతను పెంచేందుకు ఉత్తమ పద్ధతుల అమలుతో పాటు పరిశోధన, అభివృద్ధిలో సహకరించాలని వ్యవసాయ, అనుబంధ రంగాల విశ్వవిద్యాలయాలు, పరిశోధన కేంద్రాలకు వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది.

అనారోగ్య సమస్యలకు చెక్‌
కొర్రలు : రాష్ట్రంలో కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అండు కొర్రలు, సజ్జలు, రాగులు, వరిగలు, జొన్నలు ఎక్కువగా సాగవుతాయి. చిరుధాన్యాలన్నింటిలోనూ ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. కొర్రలతో నరాలకు శక్తి, మానసిక దృఢత్వం లభిస్తుంది. కీళ్ల నొప్పులు, పార్కిన్సన్, మూర్ఛ రోగాల నుంచి విముక్తి కలిగిస్తాయి.
సామలు : సంతాన లేమి సమస్యను అధిగమించేందుకు సామలు తోడ్పడతాయి. అండాశయం, వీర్య సమస్యలు, పీసీవోడీ, ఊబకాయ సమస్యలను నివారిస్తాయి. అయితే అండు కొర్రలను కనీసం నాలుగు గంటలు నానబెట్టి వండుకోవాలి. మిగతా చిరు ధాన్యాలను రెండు గంటలైనా నానబెట్టాలి. థైరాయిడ్‌ సమస్యలకు చిరు ధాన్యాలు దివ్యౌషధమని నిపుణులు చెబుతున్నారు. 
ఊదలు : కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. లివరు, కిడ్నీ, ఎండ్రోక్రెయిన్‌ గ్లాండ్స్‌ను ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడతాయి. అలాగే కామెర్లను తగ్గిస్తాయి. 
అరికలు : అరికలు రక్తశుద్ధికి తోడ్పడటంతో పాటు రక్త హీనత, డయాబెటిస్, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top