
ఇది ఉద్యోగుల సప్లై కంపెనీగా తయారైంది
సచివాలయాల ఉద్యోగులను వాళ్ల మాతృ శాఖల్లో విలీనం చేయాలి
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను ఎక్కడ ఏపనికి అవసరమైతే అక్కడ ఉపయోగించుకుంటున్నారు తప్ప వారి సమస్యల గురించి ఎవరూ పట్టించుకోవడంలేదని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఉద్యోగులను సప్లై చేసే కంపెనీ మాదిరిగా పని చేస్తోందని దుయ్యబట్టింది.
పండుగలు, సెలవులు, ఆదివారాల్లో కూడా పని ఒత్తిడితో ఉద్యోగులను వేధిస్తున్నారని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖను రద్దుచేసి, ఉద్యోగులను మాతృశాఖలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల్లో సర్దుబాటు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐక్యవేదిక చైర్మన్ ఎండీ జానీపాషా, సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్‌కృష్ణ, కన్వినర్ షేక్ అబ్దుల్ రజాక్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
1.3 లక్షల మంది ఉద్యోగులకు ఆత్మగౌరవం లేకుండా పోయింది
ప్రభుత్వ తీరు వల్ల గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న 1.3 లక్షల మంది ఉద్యోగులకు ఆత్మగౌరవం లేకుండా పోయిందని ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. ‘గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కేవలం ఉద్యోగులను కట్టు బానిసలుగా, రోజుకూలీల మాదిరిగా వెట్టి చాకిరీ చేయించడం కోసం సమన్వయం చేసే శాఖగా మాత్రమే పని చేస్తోంది. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా విఫలమవుతోంది.
నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరు, ప్రొబేషన్ ఆలస్యం అయిన కాలానికి అరియర్స్ చెల్లింపులు, రికార్డు అసిస్టెంట్ క్యాడర్‌ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌గా మార్చటం, ఆరేళ్ల స్పెషల్ ఇంక్రిమెంట్, పదోన్నతులు, మా™తృశాఖలో, ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం, ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా చేపట్టిన బదిలీలు, సమయపాలన లేని పని ఒత్తిడి వంటి ప్రధాన అంశాలపై ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదు’ అని పేర్కొన్నారు.