ఆంధ్రప్రదేశ్‌లో 12 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు 

12 Fast Track Courts in Andhra Pradesh Rajya Sabha Central Govt - Sakshi

రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం  

సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారం కేసులు, చిన్నారులపై జరిగే లైంగిక అత్యాచారం (పోక్సో) కేసులను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో 12 ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ కోర్టులు ఏర్పాటు చేసినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు చెప్పారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. అత్యాచారం, పోక్సో కేసుల పరిష్కారం కోసం దేశంలో 1,023 ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని 2019 అక్టోబర్‌లో నిర్ణయించినట్లు తెలిపారు.

ప్రస్తుతం దేశంలో 728 ఫాస్ట్‌ట్రాక్‌ ప్రత్యేక కోర్టులు పని చేస్తున్నట్లు చెప్పారు. ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ కోర్టుల కాలపరిమితిని ఒక ఏడాదికి పరిమితం చేయాలని ముందుగా నిర్దేశించినా తదుపరి 2023 మార్చి 31 వరకు వీటిని కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్‌ నాటికి దేశంలోని అన్ని ఫాస్ట్‌ట్రాక్‌ ప్రత్యేక కోర్టుల్లో కలిపి లక్షకుపైగా కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. 

ఏపీ హైకోర్టులో ఐదు జడ్జి పోస్టులు ఖాళీ  
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కేవలం ఆరుగురు న్యాయమూర్తుల ఖాళీలు భర్తీచేయాల్సి ఉందని విజయసాయిరెడ్డి మరో ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు జవాబిచ్చారు. ఏపీ హైకోర్టులో ఆమోదించిన శాశ్వత, అదనపు న్యాయమూర్తుల సంఖ్య 37 అని తెలిపారు. ఖాళీగా ఉన్న ఐదు జడ్జి పోస్టులకు కొలీజియం నుంచి సిఫార్సులు రాలేదన్నారు.

రిజర్వేషన్లు వర్తించవు  
ఆర్టికల్‌ 124, 217, 224 ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం ఉంటుందని, అయితే కులాలు, వర్గాలకు రిజర్వేషన్లు వర్తింపజేయలేదని కిరణ్‌ రిజిజు తెలిపారు. అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలను సిఫార్సు చేయాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కేంద్రం కోరుతోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య ప్రశ్నకు సమాధానమిచ్చారు.  

హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి 
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రిన్సిపల్‌ సీటును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలని కోరుతూ 2020 ఫిబ్రవరిలో ఏపీ సీఎం ప్రతిపాదనలు పంపించారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ప్రశ్నలకు మంత్రి జవాబిస్తూ.. హైకోర్టును తరలించాలంటే రాష్ట్ర హైకోర్టుతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

హైకోర్టు తరలింపు అంశం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు పరిధిలోనే ఉంటుందని, తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాలని పేర్కొన్నారు. ఆ తర్వాత తరలింపుపై పూర్తిస్థాయి ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాలని సూచించారు. కానీ ఇప్పటి వరకు అలాంటి పూర్తి ప్రతిపాదనేదీ కేంద్రం వద్ద పెండింగ్‌లో లేదన్నారు. అయితే హైకోర్టు నిర్వహణ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని, సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టు రోజువారీ కార్యకలాపాలను నిర్వర్తించేందుకు బాధ్యత వహిస్తారని చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top