అనంతపురం: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అధికార పార్టీ నాయకుల మితిమీరిన జోక్యం వల్ల పారదర్శక ఓటరు జాబితాపై సందేహాలు తలెత్తుతున్నాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును అర్హులు కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం వీరు కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్ ఆనంద్‌ను కలిసి.. ‘సర్’పై అభ్యంతరాలను తెలియజేశారు. అనంతరం అనంత వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో అధికార పార్టీకి చెందిన బీఎల్‌ఏ (బూత్ లెవల్ ఏజెంట్)లు తమకు తెలియకుండా ఏమీ చేయకూడదని బీఎల్‌ఓ (బూత్ లెవల్ ఆఫీసర్)లపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. శింగనమలతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఐదు రోజులుగా వెలుగుచూసిన ఘటనలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి.. బీఎల్‌ఓలు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరామని చెప్పారు. చాలా చోట్ల బీఎల్‌ఓలు, ఈఆర్‌ఓలకు ‘సర్’ ప్రక్రియపై ఇప్పటికీ అవగాహన లేకపోవడం కూడా ఇబ్బందిగా మారుతోందని అన్నారు. డబుల్, డెత్ ఓటర్లతో పాటు వలస వెళ్లిన వారికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగామని తెలిపారు. అనంతపురం నగరంలో డెత్, వలస ఓట్లు అధికంగా ఉన్నాయని చెప్పారు. ఎన్యుమరేషన్ ఫారాలు ఎలా రాయాలో తెలియని వారి కోసం ఎన్నికల సంఘం నుంచే ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. అధికార పార్టీ బీఎల్‌ఏలు రాకపోతే కొన్నిచోట్ల ‘సర్’ ప్రక్రియను వాయిదా వేస్తున్నారని తెలియజేశారు. ‘సర్’ ముగిశాక కూడా ఇంకా డెత్, వలస ఓట్లు అలాగే ఉంటే ఎన్నికల సంఘం లక్ష్యం నెరవేరనట్టేనని స్పష్టం చేశారు. దీంతో రెండ్రోజుల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అర్హుల ఓట్లు తొలగిస్తే ఊరుకోం
శింగనమల నియోజకవర్గంలో బీఎల్‌ఏలు కాని వ్యక్తులు ‘సర్’ ప్రక్రియలో పాల్గొని తమకు అనుకూలం కాని వారి ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులలో ఏ ఒక్క ఓటు తొలగించినా ఉపేక్షించేది లేదన్నారు. బీఎల్‌ఏ కాని వ్యక్తి ‘సర్’ ప్రక్రియలో పాల్గొని ఓటర్లను బెదిరించిన ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను కలెక్టర్‌కు అందించామని చెప్పారు. అధికార పార్టీకి చెందిన బీఎల్‌ఏలు.. బీఎల్‌ఓలతో పాటు ఓటర్లపై పెత్తనం చేస్తున్నారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఇందుకు సంబంధించి కొన్ని సాక్ష్యాలను కలెక్టర్‌కు అందించినట్లు తెలిపారు. ‘సర్’ ప్రక్రియలో అధికార పార్టీ ప్రమేయం లేకుండా చూడాలని కోరామని, అదే సమయంలో తాము కూడా సహకరిస్తామని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఒక ఓటరుకు రెండు, మూడు చోట్ల ఓటు హక్కు ఉండడానికి వీల్లేదని తెలిపారు. క్షేత్రస్థాయిలో తప్పులు జరిగితే భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. అర్హులైన ఏ ఒక్క ఓటు తొలగించకుండా చూడాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సాకే రుత్విక్, వైఎస్సార్సీపీ బూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎద్దుల అమర్ నాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ నీలం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
అధికార పార్టీ నేతల మితిమీరిన జోక్యం
శింగనమల నియోజకవర్గంలో ఓటర్లకు బెదిరింపులు
డబుల్ ఓట్లు, మైగ్రేట్, చనిపోయిన వారి ఓట్ల కొనసాగింపు
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, మాజీ మంత్రి శైలజానాథ్


