భయపడొద్దు.. అండగా ఉంటాం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి
అనంతపురం: ‘చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారనే అక్కసుతో వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు. నాయకులు, కార్యకర్తలకు పార్టీ సంపూర్ణంగా అండగా ఉంటుంది’ అని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డికి బెయిల్ మంజూరు కావడంపై ఆయన స్పందించారు. న్యాయస్థానం తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. ప్రశ్నిస్తున్న వారిపై చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తోందని దుయ్యబట్టారు. హిందూపురంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయ ధ్వంసం, కారుమూరి వెంకటరెడ్డి కేసు ఘటనలో పార్టీ నాయకులు, లీగల్ టీం, కార్యకర్తలు స్పందించిన తీరు ప్రశంసనీయమన్నారు. పార్టీ నాయకుడికిగానీ, కార్యకర్తకు గానీ ఎలాంటి కష్టం వచ్చినా వైఎస్సార్‌సీపీ లీగల్ టీం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే కారుమూరి వెంకటరెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారని, అయితే అంతిమంగా న్యాయస్థానంలో తమకు న్యాయం జరిగిందన్నారు. ఇందుకు చొరవ చూపిన లీగల్ టీం సభ్యులు హరినాథ రెడ్డి, ఉమాపతి, రాజశేఖర్ యాదవ్, శ్రీనివాస రెడ్డి, ఎన్వీ భాస్కర్ రెడ్డి, ప్రభులను జిల్లా అధ్యక్షుడు ‘అనంత’ అభినందించారు.
అరటికి గిట్టుబాటు కల్పించండి
అనంతపురం
అగ్రికల్చర్: అరటి
పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. బుధవారం ‘సాక్షి’లో ‘అరటి రైతుల ఆక్రందన’ శీర్షికన ప్రచురితమైన కథనంపై కలెక్టర్ స్పందించారు. ఉద్యానశాఖ, మార్కెటింగ్, డీఆర్‌డీఏ, మెప్మా అధికారులతో పాటు అరటి ఎగుమతిదారులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఎందుకీ పరిస్థితి తలెత్తిందని ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ కష్టపడి పండించిన అరటి పంటను రోడ్డు పాలు చేయడం బాధ కలిగిస్తోందన్నారు. ఈ పరిస్థితి నుంచి రైతులను గట్టెక్కించాలని సూచించారు. నాణ్యతను బట్టి టన్ను రూ.6 వేల నుంచి రూ.8 వేలకు కొనుగోలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఉద్యానశాఖ డీడీ ఉమాదేవి, ఏడీ దేవానందకుమార్, మార్కెటింగ్‌శాఖ ఏడీ రాఘవేంద్రకుమార్, డీఆర్ డీఏ పీడీ శైలజ, ఎస్‌కే బనానా తదితర ఎగుమతిదారుల కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉద్యాన పంటలపై ఆసక్తి పెంచుకోవాలి
ఉరవకొండ: జిల్లా రైతాంగం ఉద్యాన పంటలపై ఆసక్తి పెంచుకోవాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ‘పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ’ పథకం నిధుల విడుదల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో మైక్రో ఇరిగేషన్ ద్వారా సులువుగా పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో 46 లక్షల మంది రైతులకు ప్రభుత్వం సాయం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, ఏడీ లక్ష్మినారాయణ, ఏడీఏ సత్యనారాయణ, ఏఓ రామకృష్ణుడు పాల్గొన్నారు.
భయపడొద్దు.. అండగా ఉంటాం


