ఈ –పంట నమోదుపై అభ్యంతరాలుంటే తెలపండి
కళ్యాణదుర్గం/ఆత్మకూరు: ఖరీఫ్ పంటల సాగుకు సంబంధించి ఈ– పంట సామాజిక తనిఖీ కోసం ప్రదర్శనకు ఉంచిన ముసాయిదా జాబితాను జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) ఉమామహేశ్వరమ్మ శుక్రవారం ఆత్మకూరు రైతు సేవ కేంద్రంలో పరిశీలించారు. అలాగే ఆమె ఏడీఏ యల్లప్ప, ఏఓ శ్రావణ్ కుమార్‌తో కలిసి కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి ఆర్‌ఎస్‌కేతో పాటు కళ్యాణదుర్గంలో వ్యవసాయ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ పంటలు సాగు చేసి ఈ–క్రాప్ నమోదు చేసుకున్న రైతుల వివరాలు రైతు సేవ కేంద్రాల్లో ఉంటాయని, అభ్యంతరాలు ఉన్న వారు ఈ నెల 16లోపు వ్యవసాయ అధికారులకు, సిబ్బందికి రాత పూర్వకంగా తెలియజేయాలన్నారు. 17వ తేదీన తుది జాబితా తయారు చేసేందుకు వీలుంటుందని రైతులకు సూచించారు. తుది జాబితా తరువాత ఎటువంటి మార్పులు, చేర్పులు ఉండవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి విజయ్ జ్యోతుకుమార్, ఏఈఓ రాము, వ్యవసాయ సిబ్బంది భార్గవి, దీపిక పాల్గొన్నారు.
పర్వతారోహణలో కుసుమ అరుదైన ఘనత
శింగనమల(నార్పల): పర్వతారోహణలో జిల్లాకు చెందిన కుసుమ అరుదైన ఘనత సాధించింది. నార్పల మండలం దుగుమర్రి గ్రామానికి చెందిన రైతు పెద్దన్న, నారాయణమ్మ దంపతుల కుమార్తె కె.కుసుమ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని గీత అకాడమీలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఫస్టియర్‌లోనే ఆమెకు పర్వతారోహణపై ఆసక్తి ఏర్పడింది. భువనగిరిలోని రాక్ క్లెయిన్ స్కూల్‌లో శిక్షణ తీసుకుంది. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలన్న ధ్యేయంతో పర్వతాలను ఎక్కడం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఈ నెల ఎనిమిదో తేదీన హైదరాబాద్ నుంచి ఆఫ్రికాకు బయల్దేరింది. ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తయిన, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీస్టాండింగ్ పర్వతంగా పేరుగాంచిన కిలిమంజారో మౌంటెన్‌ను ఈ నెల 12న అధిరోహించింది. శిఖరంపై జాతీయ జెండాతో పాటు ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను ఎగురవేసింది. ఈ సందర్భంగా గ్రామస్తులు కుసుమకు అభినందనలు తెలిపారు.
ఆకట్టుకునేలా ఆటలతో పాఠాలు
అనంతపురం సిటీ: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల చిట్టి మనస్సును ఆకట్టుకునేలా ఆటలతో పాఠాలు బోధించేలా విద్యా శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిన్నారుల్లో అభ్యసనా సామర్థ్యం మెరుగుపరిచేందుకు జాదూ యి మిఠాయి (మాయా పెట్టె) కిట్లను సరఫరా చేసింది. జిల్లాలోని 975 ప్రాథమిక పాఠశాలలకు ఈ కిట్లు మంజూరయ్యాయి. ఒక్కో కిట్‌లో 62 రకాల ఆట పరికరాలు ఉన్నాయి. వీటిలో రంగుల బొమ్మలు, బోధనోపకరణాలు, అంకెలు, అక్షరాలు, రంగు పెన్సిళ్లు, తెలుగు, ఆంగ్ల భాషలతో కూడిన అక్షరాలు, గణిత అంశాలను సులభంగా గుర్తించే ఆకారాలు ఉన్నాయి. వీటిని అంగన్‌వాడీ కేంద్రాలకు అనుబంధంగా ఒకటి, రెండు తరగతులు ఉన్న పాఠశాలల విద్యార్థుల సంఖ్యను బట్టి ఒకటి లేదా రెండు కిట్లు అందిస్తున్నారు.
సృజనాత్మకత వెలికితీయడానికే..
పఠనం పట్ల పిల్లల్లో ఆసక్తిని, ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను, సంభాషణ నైపుణ్యాలను పెంచడమే లక్ష్యంగా ఈ వినూత్న కార్యక్రమానికి విద్యా శాఖ శ్రీకారం చుట్టింది.
ఈ –పంట నమోదుపై అభ్యంతరాలుంటే తెలపండి
ఈ –పంట నమోదుపై అభ్యంతరాలుంటే తెలపండి


