జనవరి 10 వరకు తుంగభద్ర జలాలు
● బెంగళూరులో జరిగిన ఐసీసీ సమావేశంలో తీర్మానం
బొమ్మనహాళ్: ప్రస్తుతం ఆయకట్టు పరిధిలో సాగు చేసిన పంటలకు తుంగభద్ర జలాలను జనవరి పదో తేదీ వరకు విడుదల చేసేందుకు ఐసీసీ కమిటీ నిర్ణయించింది. శుక్రవారం బెంగళూరులోని విధాన పరిషత్‌లోని జలవనరుల శాఖ కార్యాలయంలో 125వ ఐసీసీ (నీటి సలహా మండలి) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తుంగభద్ర బోర్డు నీటి పారుదల కమిటీ చైర్మన్ శివరాజ్ తంగడిగే అధ్యక్షత వహించారు. కర్ణాటక జలవనరుల శాఖా మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రి బోసరాజు, పలువురు ఎమ్మెల్యేలు, తుంగభద్ర బోర్డు చైర్మన్ ప్యాండే, బోర్డు ఎస్‌ఈ నారాయణనాయక్, ఇతర ఇంజినీర్లు, రైతులలో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. జలవనరుల శాఖా మంత్రి డీకే శివకుమార్ మాట్లాడారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 75.989 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నీటిని తుంగభద్ర జలాశయం కింద ఉన్న ఆంధ్రలోని హెచ్చెల్సీ, ఎల్‌ఎల్‌సీతో పాటు కర్ణాటకలోని ఆర్‌బీఎంసీ ఇతర కాలువల కింద సాగులో ఉన్న పంటలకు అందించాలని నిర్ణయించారు. జలాశయం నుంచి రోజుకు 1.50 నుంచి 1.75 టీఎంసీల నీరు వినియోగమవుతోంది, దీని ప్రకారం జనవరి 10 నాటికి స్టాండింగ్ క్రాప్‌కు నీరు అంది రైతులకు దిగుబడులు చేతికి వస్తాయని అన్నారు. ఆ తర్వాత తుంగభద్ర జలాశయంలో బెడ్ లెవెల్ వరకు నీరు ఉంచుకొని తర్వాత నూతనంగా రూ.80 కోట్లతో క్రస్ట్ గేట్లను డ్యాంకు అమర్చుతామని చెప్పారు.
రబీ పంటలకు నీరివ్వలేం
తుంగభద్ర జలాశయంలో 80 టీఎంసీల నీరు ఉంటుంది కాబట్టి రబీ సీజన్‌లో పంటల సాగుకు వదలాలని కొందరు రైతు సంఘం నాయకులు సమావేశంలో కోరారు. ఇందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ రబీకి నీరివ్వడం సాధ్యపడదన్నారు. రబీకి నీరు వదిలితే క్రస్ట్ గేట్లు అమర్చడం ఆలస్యమవుతుందన్నారు. క్రస్ట్ గేట్లు అమర్చకపోతే డ్యాంకే ప్రమాదం ఏర్పడుతుందని, రెండు రాష్ట్రాల రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. రైతు సంఘం నాయకులు, అధికారులు కూడా రైతులకు ఈ విషయాన్ని అర్ధమయ్యేలా వివరించాలని సూచించారు. తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి ఇప్పటి వరకు 19.6 టీఎంసీల నీరు వచ్చాయని, ఇంకా 7 టీంఎసీల వరకు నీరు వచ్చే అవకాశం ఉందని బోర్డు అధికారులు తెలిపారు.


