రూ.కోటికి పైగానే సొమ్ము పక్కదారి!
● ‘పశు’ శాఖలో ఆడిట్ బృందం తనిఖీలు
● బహిర్గతమవుతున్న ‘అనుమానాస్పద’ బదలాయింపులు
అనంతపురం అగ్రికల్చర్: పశు సంవర్ధక శాఖలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాల బాగోతంపై రెండో రోజు శుక్రవారం కూడా ముగ్గురు సభ్యులతో కూడిన రాష్ట్ర స్థాయి ఆడిట్ బృందం విస్తృతంగా పరిశీలన చేపట్టింది. తొలిరోజు పరిశీలనలో రూ.లక్షలకు లక్షలు బదలాయింపు జరిగిన అనుమానాస్పద ఖాతాలకు సంబంధించి బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఇతర ఓచర్లు, బిల్లులు కావాలని జేడీ డాక్టర్ ప్రేమ్‌చంద్‌ను కోరారు. ఈ ఏడాది మే నెల 2న రూ.2.49 కోట్లు, 5న రూ.2.49 కోట్లు, 8న రూ.10.47 కోట్లు ఆ శాఖకు సంబంధించి ఒకరి ఖాతాకు, అలాగే శాఖకు సంబంధం లేని మరో వ్యక్తి ఖాతాకు బదిలీ జరిగిందని గుర్తించారు. అలాగే మరో ఐదారు ఖాతాలకు కూడా రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ట్రాన్స్‌ఫర్ జరిగినట్లు చెబుతున్నారు. మరొక ఖాతాల్లో పెద్ద మొత్తంలో నిల్వ చేసినట్లు గుర్తించినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా మూడు ప్రధాన బ్యాంకులు, వాటి పరిధిలో ఉన్న 15 నుంచి 20 బ్యాంకు అకౌంట్లకు సంబంధించి పూర్తి వివరాలు పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ అక్రమ సొమ్ము వ్యవహారంలో ఆ శాఖకు చెందిన ఐదారుగురి పాత్ర ఉంటుందని అనుమానిస్తున్నారు. అందులో ఒకరు సింహభాగం లబ్ధి పొందగా, మరొకరు మోస్తరుగానూ, మిగతా వారికి కొంత వరకు ముట్టి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అనుమానం కలిగిన బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ట్రాన్స్‌ఫర్ చేసిన వారు, సొమ్ము పొందిన వారిని కూడా పిలిపించి వాంగ్మూలం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అక్రమాలు జరిగినట్లు రుజువైతే సంబంధిత వ్యక్తులపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందంటున్నారు. మొత్తం మీద రూ.కోటికి పైగానే సొమ్ము పక్కదారి పట్టినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి ఆడిట్ బృందాలు, జేడీ నిరాకరించారు. సరైన పత్రాలు లేకుండా అనుమానాస్పద ఖాతాలు, బదలాయింపులు రికార్డు చేసుకుని కమిషనరేట్ కార్యాలయంలో కూడా వివరాలు సేకరించి తుది నివేదిక అందజేస్తామని ఆడిట్ అధికారులు తెలిపారు.


