మత్తులో ఘోరాలు..
●గుంతకల్లు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో గత నెల 13న రౌడీషీటర్ కమ్మ ఆనంద్ (33) అలియాస్ బొంబాయి ఆనంద్ దారుణహత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో ఈ హత్య జరిగింది. ఆనంద్ స్నేహితుడే మద్యం మత్తులో అతని తలపై
బండరాయితో మోది చంపాడు.
●గత నెల 18న అనంతపురం గుత్తి రోడ్డులోని తడకలేరు సమీపంలో గుణ అనే వ్యక్తిపై కొందరు దాడి చేశారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దాడి చేస్తున్న సమయంలో అక్కడి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇప్పటికీ ఘటనను తలచుకుని ప్రజలు వణికిపోతున్నారు.
●తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్‌ను ఇటీవల తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇష్టారాజ్యంగా దూషించారు. ఏకంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజునే ఏఎస్పీపై రెచ్చిపోయి మాట్లాడారు. దేశంలోనే అత్యున్నత సర్వీస్ అయిన ఓ ఐపీఎస్ అధికారిపై జేసీ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
.... జిల్లాలో శాంతిభద్రతలు ఎంతగా
దిగజారాయో చెప్పేందుకు ఈ ఘటనలే నిదర్శనాలు.
అనంతపురం సెంట్రల్: జిల్లావ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒక చోట హత్యలు, దాడుల ఘటనలు జరుగుతుండడం కలకలం రేపుతోంది. నేరాలు పెరిగిపోవడంతో సామాన్యులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.
వాలిపోతున్న ‘పచ్చ గద్దలు’
అధికార అండతో ‘పచ్చ’ నాయకులు భూకబ్జాలకూ ఒడిగడుతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోయి పాగా వేయాలని చూస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి బాధితులపై బెదిరింపులకు దిగుతున్నారు. టీడీపీ నేతల భూదాహం చూసిన ప్రజలు భయకంపితులవుతున్నారు. అధికారులను ఆశ్రయిస్తున్నా తగిన స్పందన లేకపోవడంతో బాధితుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంటోంది.
బెదిరింపుల పర్వం
అరాచకాలను వెలుగులోకి తెస్తున్న మీడియా ప్రతినిధులపై కొందరు ప్రజాప్రతినిధులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇటీవల విలేకరులపై ‘మీ అంతు చూస్తా’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి రెచ్చిపోగా.. గుంతకల్లులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విలేకరులను ఏకంగా రైలు పట్టాలపై పడుకో పెడతా అంటూ బెదిరించడం గమనార్హం. ఇక.. శింగనమల నియోజకవర్గంలో ఎర్రమట్టి దోపిడీని వెలుగులోకి తీసుకొచ్చిన ఓ విలేకరిపై ఇటీవల ‘పచ్చ’ మూక దాడికి పాల్పడింది.
అమలు కాని ఎస్పీ ఆదేశాలు..
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీ జగదీష్ కృషి చేస్తున్నా క్షేత్రస్థాయిలో పోలీసు అధికారులు మాత్రం అందుకు భిన్నంగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు చెబితేనే పోస్టింగ్ వచ్చిందని, దీంతో వారు చెప్పినట్లే పనిచేయాలనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ నాయకుల దాడులు, దౌర్జన్యాలపై బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసుస్టేషన్‌లో కేసులు నమోదు కావడం లేదు. తాడిపత్రి, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. కూడేరు సీఐ రాజు తీరుతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ సీపీ నాయకులు, సానుభూతిపరులు పోలీసుస్టేషన్‌కు వెళ్తే బూతులు మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఇటీవల పలువురు బాధితులు అనంతపురంలోని ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగడం చర్చనీయాంశమైంది.
కూటమి ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుంది. ఈ క్రమంలో ఎక్కడ పడితే అక్కడ లిక్కర్ దొరుకుతుండడంతో మందుబాబులు పూటుగా తాగి అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల అనంతపురంలోని హౌసింగ్ బోర్డులో మందుబాబులు హల్‌చల్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఈ క్రమంలో మహిళలు రోడ్లపై తిరగాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక..గంజాయికి కూడా జిల్లా అడ్డాగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గుత్తి రోడ్డుకు చెందిన ఓ యువకుడు గంజాయికి బానిసగా మారి ఆ మత్తులో సొంత మేనమామపైనే దాడి చేశాడు.
జిల్లాలో అటకెక్కిన శాంతిభద్రతలు
నిత్యం ఎక్కడో ఒక చోట
హత్యలు, దాడుల ఘటనలు
పెచ్చుమీరుతున్న అధికార పార్టీ
నేతల అరాచకాలు
పోలీసుల గస్తీ లేక పెరిగిన మందుబాబుల ఆగడాలు
రాజకీయ పోస్టింగ్‌లు కావడంతో నోరు మెదపని ఖాకీలు
							మత్తులో ఘోరాలు..

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
