రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

Nov 2 2025 9:04 AM | Updated on Nov 2 2025 9:04 AM

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

కళ్యాణదుర్గం రూరల్‌: రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందాడు. ఇదే ఘటనలో తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల తెలిపిన మేరకు... పాతచెరువు గ్రామంలో నివాసం ఉండే వన్నూరస్వామి తన కుమారుడు ప్రజ్వల్‌ (6)తో కలిసి శనివారం ద్విచక్రవాహనంపై గోళ్ల గ్రామం వైపు బయల్దేరాడు. గోళ్ల సమీపంలో రాగానే అనంతపురం నుంచి వేగంగా వచ్చిన కారు వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. బైక్‌పై వస్తున్న తండ్రీ కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో వారిని స్థానిక సీహెచ్‌సీకి చేర్చారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. కారులో బెలూన్లు సకాలంలో తెరుచుకోవడండో అందులో ప్రయాణిస్తున్న వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. అనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రజ్వల్‌ (6)మృతి చెందాడు. రూరల్‌ పోలీసుల సంఘన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.

స్పందించని 108 వాహనం : రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించారు. అయితే అంబులెన్స్‌ ఎంత సేపటికీ రాలేదు. చేసేది లేక ప్రైవేటు వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

‘తపాలా’ ఆధ్వర్యంలో ఉత్తర రచన పోటీలు

అనంతపురం సిటీ: తపాలా శాఖ ఆధ్వర్యంలో ఉత్తర రచన (లెటర్‌ రైటింగ్‌) పోటీలు నిర్వహించనున్నట్లు ఆ శాఖ అనంతపురం డివిజన్‌ సూపరింటెండెంట్‌ అమర్‌నాథ్‌ శనివారం తెలిపారు. ఇందులో భాగంగా ‘లెటర్‌ టు మై రోల్‌ మోడల్‌’ అనే అంశంపై నిర్వహించే పోటీల్లో ఎవరైనా పాల్గొనవచ్చని, వయో పరిమితి లేదని స్పష్టం చేశారు. పోటీలు 18 ఏళ్లలోపు వారికి ఒక విభాగం, 18 ఏళ్లు పైబడిన వారికి మరొక విభాగం కింద ఉంటాయన్నారు. ప్రతి కేటగిరీలో రెండు విభాగాలలో ఉత్తర రచన పోటీలు ఉంటాయని తెలిపారు. ఇన్‌లాండ్‌ లెటర్‌ కార్డ్‌ కేటగిరి–500 పదాలలోపు ఉండాలి. ఎన్వలప్‌ కేటగిరి–1000 పదాలకు మించకుండా రాయాలని స్పష్టం చేశారు. చేతితో రాసిన ఉత్తరం మాత్రమే అనుమతిస్తామని ప్రకటించారు. తెలుగు, హిందీ, ఆంగ్లంలో రాసిన ఉత్తరాలు డిసెంబర్‌ 25లోగా పంపాలని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.10 వేలు, తృతీయ బహుమతి రూ.5 వేలు ఉంటుందని వెల్లడించారు. జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి రూ.50 వేలు, ద్వితీయ బహుమతి రూ.25 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు ఉంటుందని ఆయన తెలిపారు.

చేతి రాతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే..

సెల్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాల కాలంలో ఉత్తర రచన సంప్రదాయం మరుగున పడిపోతోందని తపాలా సూపరింటెండెంట్‌ అమర్‌నాథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, యువత, ప్రజల్లో ఉత్తర రచనపై ఆసక్తి పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించతలపెట్టినట్లు వెల్లడించారు. ఆసక్తి గల వారు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవలని కోరారు.

హెచ్చెల్సీలో కొట్టుకుపోయి బాలుడి మృతి

పెద్దవడుగూరు: పొలం నుంచి ఇంటికి బయల్దేరిన బాలుడు మార్గమధ్యంలోని హెచ్చెల్సీని దాటే క్రమంలో ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు.. బుర్నాకుంట గ్రామానికి చెందిన రామాంజనేయులు, శశికళ దంపతులు. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. 12 ఏళ్ల క్రితం రామాంజనేయులు మృతి చెందాడు. అప్పటి నుంచి శశికళ వ్యవసాయ పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. కుమార్తె ఇంటర్మీడియెట్‌, కుమారుడు పదో తరగతి చదువుతున్నారు. కుమారుడు పృధ్వీరాజ్‌ శనివారం పాఠశాలకు వెళ్లలేదు. తాత పొలంలో వేరుశనగ కట్టెను మిషన్‌తో నూర్పిడి చేస్తున్నారని, అక్కడికి బయల్దేరాడు. మార్గమధ్యంలో హెచ్చెల్సీలో దిగి అవతలి పొలం వైపునకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో నీటిలోకి దిగిన పృధ్వీరాజ్‌ ప్రవాహ ఉధృతికి పట్టుతప్పి కిందపడి కొట్టుకుపోయాడు. సమీపంలోని బ్రిడ్జి వద్ద సుడిగుండంలో చిక్కుకుపోయాడు. గమనించిన స్థానికులు బాలుడిని బయటకు తీసి పెద్దవడుగూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పృధ్వీరాజ్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement