చెస్‌లో గుంతకల్లు విద్యార్థికి రికార్డ్‌స్థాయి రేటింగ్
గుంతకల్లు: ఇటీవల కర్నూలులో నిర్వహించిన చెస్ టోర్నీలో ప్రతిభ చాటిన గుంతకల్లు విద్యార్థి సాయి సౌరిస్ అంతర్జాతీయ రేటింగ్ సాధించినట్లు కోచ్‌లు అనిల్‌కుమార్, రామారావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మండీ బజార్‌లో నివాసముంటున్న వంకదారు వీరేంద్ర, సౌమ్య దంపతుల కుమారుడు సాయి సౌరిస్ రోటరీ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. కర్నూలులో నిర్వహించిన అంతర్జాతీయ చెస్ టోర్నీలో పాల్గొని ప్రతభ కనబరచడంతో రాపిడ్ విభాగంలో 1440 రేటింగ్, బ్లిట్జ్ విభాగంలో 1651 రేటింగ్ సాధించి రికార్డు నెలకొల్పోనట్లు వివరించారు. ఇంత వరకు గుంతకల్లు చదరంగ క్రీడల్లో ఇదే అత్యుత్తమ రికార్డు అన్నారు. దీంతో విద్యార్థి సాయి సౌరిస్‌ను ఉపాధ్యాయులుతోపాటు పలువురు అభినందించారు.
స్కూటీ డిక్కీలో
రూ.6 లక్షల చోరీ
గుత్తి: స్కూటీ డిక్కీలో భద్రపరచిన రూ.6లక్షల నగదును దుండగులు చోరీ చేశారు. వివరాల్లోకెళితే... కాసేపల్లికి చెందిన ఓబులేష్‌రెడ్డి గుత్తిలోని బీసీ కాలనీలో నివాసముంటున్నాడు. అనంతపురం రోడ్డులో కారు వాటర్ సర్వీస్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితం కాసేపల్లిలో ఉన్న పొలం అమ్మాడు. ఆ డబ్బును ఇంటిలో ఉంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం ఆ డబ్బును బాకీలు ఉన్న వారికి కట్టడానికి స్కూటీ డిక్కీలో పెట్టి అయ్యప్పస్వామి దేవాలయానికి వెళ్లాడు. స్వామిని దర్శించుకుని బయటకు వచ్చేసరికి స్కూటీ డిక్కీ తెరిచి ఉంది. అనుమానం వచ్చి పరిశీలించగా అందులో నగదు కనిపించలేదు. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ సురేష్ కేసు నమోదు చేశారు.
నేటి నుంచి రాష్ట్రస్థాయి సెపక్‌తక్రా పోటీలు
ఉరవకొండ: రాష్ట్రస్థాయి సెపక్‌తక్రా స్కూల్ గేమ్స్ పోటీలు ఉరవకొండలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ సెంట్రల్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం సెపక్‌తక్రా క్రీడా సంఘం చైర్మన్ సప్తగిరి మల్లికార్జున, ప్రెసిడెంట్ షాహీన్, పాఠశాల హెచ్‌ఎం రాజేశ్వరి, సీనియర్ పీడీ మారుతీ ప్రసాద్, పుల్లా రాఘవేంద్ర మీడియాకు వెల్లడించారు. ఈ నెల 2, 3, 4 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి అండర్–14, అండర్–17 పోటీలకు రాష్ట్ర నలుమూలల నుంచి బాలబాలికలు హాజరవుతున్నారన్నారు. క్రీడాకారులు, కోచ్‌లకు భోజన వసతితో పాటు వారికి అన్ని వసతులు కల్పించామన్నారు. రాత్రి ఫ్లడ్ లైట్ల మధ్య కూడా మ్యాచ్‌లు కొనసాగుతాయన్నారు. మ్యాచ్‌లు తిలకించేందుకు ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేశామని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.


