మాతృమరణాలకు బాధ్యులపై చర్యలు తీసుకోండి
● కలెక్టర్ ఓ.ఆనంద్
అనంతపురం అర్బన్: మాతృమరణాలకు బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మాతాశిశు మరణాలపై సమీక్షించారు. అనంతపురం రూరల్ మండలం కురుగుంట–2, రాయదుర్గం–1, కొర్రపాడు–1, కొర్రపాడు యూపీహెచ్‌సీలో జరిగిన మాతృ మరణాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాతృ మరణం జరిగినప్పుడు బాధిత కుటుంబాన్ని డీఎంహెచ్‌ఓ, ఆస్పత్రి సూపరింటెండెంట్, డీసీహెచ్‌ఎస్ ఓదార్చి ఘటనపై చర్చించి నివేదికను తయారు చేసి సభ్యుల ద్వారా సంతకం తీసుకుని తనకు సమర్పించాలని ఆదేశించారు. అనంతరం వివిధ అంశాలపై సమీక్షించారు. కొర్రపాడు పరిధిలోని చదుల్ల గ్రామానికి చెందిన రాధమ్మ అనే మహిళ మాతృమరణం జరిగిందని, ఇందుకు బాధ్యురాలైన ఆశావర్కర్‌ను సర్వీసు నుంచి తొలగించి ఆమైపె ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు. యాడికి మండలం వీరన్నపల్లికి చెందిన హరిత అనే మహిళ మాతృ మరణానికి కారణమైన ఆర్‌ఎంపీపై ఎఫ్‌ఐరా నమోదు చేయాలని, ఆ గ్రామ ఆశా వర్కర్, ఏఎన్‌ఎంపై కూడా శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కురుగుంట గ్రామంలో మృదుల అనే మహిళ మాతృమరణానికి సంబంధించి వైద్య ఆరోగ్య సిబ్బంది, వైద్యాధికారులను బాధ్యులను చేస్తూ మెమో జారీ చేయాలని ఆదేశించారు. ‘‘ప్రజలకు మెరుగైన వైద్యసేవలు సత్వరం అందించే లక్ష్యంగా పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అందుకు మూల్యం చెల్లించుకోవాలి వస్తుందని హెచ్చరించారు.


