బొలెరో బోల్తా.. ఒకరి మృతి
కళ్యాణదుర్గం రూరల్/శెట్టూరు: మండలంలోని గోళ్ల గ్రామం వద్ద బొలెరో వాహనం బోల్తాపడి, వ్యవసాయ కూలీ రాజన్న(44) మృతి చెందాడు. మరో ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... శుక్రవారం ఉదయం పామిడి గ్రామం వద్ద పుచ్ఛకాయలను లోడు చేసుకుని ఏడుగురు కూలీలతో శెట్టూరు మండలానికి చెందిన బొలెరో వాహనం తిరుగు ప్రయాణమైంది. మార్గ మధ్యంలో గోళ్ల వద్దకు చేరుకోగానే టైరు పేలడంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఘటనలో కూలీ రాజన్న అక్కడికక్కడే మృతి చెందాడు. శివకృష్ట, మంజు, శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ కూలీలంతా శెట్టూరు, బ్రహ్మసముద్రం మండలానికి చెందిన వారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్‌సీకి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజన్నకు భార్య సావిత్రమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాజన్న మృతితో శెట్టూరు మండలం గొల్లలదొడ్డిలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ పెద్ద దిక్కు కోల్పోవడంతో భార్యాపిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు.


