ఓసీల సంక్షేమాన్ని విస్మరిస్తే పతనం తప్పదు
● కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి
అనంతపురం రూరల్: అగ్రవర్ణ పేదల సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రభుత్వానికి పతనం తప్పదని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం అనంతపురంలోని లలిత కళాపరిషత్‌లో నిర్వహించిన ఓసీ విద్యార్థి యువజన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, ప్రసంగించారు. ఓసీ వర్గాలకు చెందిన వ్యాపార, పారిశ్రామిక వేత్తల ద్వారానే ప్రభుత్వానికి అధిక శాతం పన్నులు వసూళ్లవుతున్నాయన్నారు. అయినా అగ్రవర్ణ పేదల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. అగ్రవర్ణ పేదల సంక్షేమానికి జాతీయ స్థాయిలో ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.లక్ష కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీని సరళీకృతం చేయాలన్నారు. ఓసీ కులాల్లోని పేదలకు సంక్షేమ పథకాలు అందించాలన్నారు. విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి బుర్రా జయవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ అర్హత టెట్ పరీక్షల్లో ఓసీలకు 90 మార్కుల నుంచి 75 మార్కులకు తగ్గించాలన్నారు. పోటీ పరీక్షలకు హజరయ్యే ఓసీ అభ్యర్థుల వయోపరిమితి సడలించాలని, ఓసీ విద్యార్థులకు సంక్షేమ హస్టళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంజునాథ్‌చౌదరి, జిల్లా అధ్యక్షుడు మురారి రాము, కార్యదర్శి అల్లె మాధవరెడ్డి, నాయకులు తమ్ముల సూరి, జితేందర్‌రెడ్డి, బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.


