 
															జీజీహెచ్‌లో మహిళ అదృశ్యం
అనంతపురం సెంట్రల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో అడ్మిషన్‌లో ఉన్న చిన్నారిని తీసుకుని ఓ తల్లి అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండ మండలం చిన్న ముష్టూరుకు చెందిన మీనుగ కేశమ్మ కనిపించలేదని భర్త ఓబులప్ప ఫిర్యాదు చేశారు. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడో సంతానమైన చిన్నారి శ్రుతికి ఆరోగ్యం బాగలేకపోతే నాలుగు రోజుల క్రితం సర్వజనాస్పత్రిలో చేర్పించారు. భర్త ఓబుళప్ప బేల్దారి పనికి వెళ్లేవాడు. ఈ క్రమంలో బుధవారం ఇద్దరు పిల్లలను ప్రభుత్వాస్పత్రిలోనే వదిలేసి చిన్న కూతురితో కలిసి తల్లి వెళ్లిపోయింది. ఓబులప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ శ్రీకాంత్‌యాదవ్ తెలిపారు.
ట్రాక్టర్‌ను ఢీకొని వ్యక్తి మృతి
శెట్టూరు: రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. శెట్టూరు మండలం ముచ్చర్లపల్లికి చెందిన గొల్ల ఈరన్న (35)కు భార్య నాగమణి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బుధవారం రాత్రి శెట్టూరు ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనంలో తన స్వగామానికి వెళుతున్న ఆయన పెరుగుపాళ్యం వద్దకు చేరుకోగానే చీకట్లో రోడ్డు పక్కన ఆపిన ట్రాక్టర్‌ను గుర్తించక ఢీకొన్నాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఈరన్నను స్థానికులు కళ్యాణదుర్గంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు కుటుంబసభ్యులు తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
వ్యక్తిపై కేసు నమోదు
రాప్తాడు రూరల్: ఆర్టీసీ డ్రైవరుపై చెప్పుతో దాడి చేసిన వ్యక్తిపై అనంతపురం రూరల్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. వివరాలు.. ఈ నెల 27న కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వస్తున్న ఆర్టీసీ నగర శివారులోని సెయింట్ ఆన్స్ స్కూల్ సమీపంలో యూటర్న్ వద్దకు చేరుకోగానే రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనదారుడు నారాయణస్వామి అడ్డుకున్నాడు. వేగంగా వస్తున్నావంటూ బస్సు డ్రైవర్ రాముతో గొడవపడుతూ చెప్పుతో దాడి చేశాడు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 
							జీజీహెచ్‌లో మహిళ అదృశ్యం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
