 
															అన్నదాత గోడు పట్టదా?
● ఉమ్మడి అనంతపురం జిల్లా రైతుల పరిస్థితి చూస్తే చాలా బాధేస్తోంది
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి
అనంతపురం: ‘చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విత్తనాలు, ఎరువులు కూడా రైతులకు సకాలంలో అందడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక రెండు ఖరీఫ్‌లు, ఒక రబీ సీజన్ ముగిసింది. ఇప్పుడు మరో రబీ ప్రారంభమైంది. ఈ నాలుగు సీజన్లలో ఏనాడూ విత్తనాలు సకాలంలో అందించిన పాపాన పోలేదు’ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రబీ సీజన్ ప్రారంభమై నెల గడిచినా రైతులకు సబ్సిడీతో పప్పుశనగ విత్తనాలు పంపిణీ చేయలేని దుస్థితిని ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 40 శాతం సబ్సిడీతో పప్పుశనగ విత్తనాలు అందిస్తే.. నేడు 25 శాతానికి కుదించారని మండి పడ్డారు. అందులోనూ గత ఏడాది జిల్లాకు 27 వేల క్వింటాళ్ల పప్పుశనగ కేటాయిస్తే ఈ ఏడాది కేవలం 14 వేల క్వింటాళ్లు మాత్రమే కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ఒక్క ప్రజాప్రతినిధి కూడా ప్రశ్నించిన పాపాన పోలేదన్నారు. ఇటీవల నిర్వహించిన డీఆర్‌సీ సమావేశంలో ప్రత్యామ్నాయ విత్తనాలు పంపిణీ చేస్తామని సాక్షాత్తూ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పినా ఇంత వరకు అతీగతీ లేదన్నారు.
అన్ని పంటలూ రోడ్డు పాలు
గిట్టుబాటు ధరలు లేక గతంలో టమాట పంటను మాత్రమే రైతులు పారేసిన ఘటనలు చూశామని, కానీ నేడు అరటి, చీనీ, మామిడి పంటలను కూడా రోడ్డుపై పడేస్తున్నారని ‘అనంత’ వాపోయారు. ఇటీవలి వరకు రూ.2,800 పలికిన క్వింటా మొక్కజొన్న నేడు రూ.1,800కి పడిపోయిందన్నారు. ఈ విషయంపై అధికార పార్టీకే చెందిన రాయదుర్గం ఎమ్మెల్యే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాయడం చూస్తే ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని అన్నారు. గతంలో మాదిరి పెద్ద ఎత్తున వలసలు, రైతుల బలవన్మరణాలు ఎక్కడ జరుగుతాయోనన్న ఆందోళన కలుగుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో పంట నష్టపోతే ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ వచ్చేదని, కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. హెచ్‌ఎల్‌సీ, హంద్రీ–నీవా నీటి నిర్వ హణలో నిర్లక్ష్యం చేస్తుండడంతో చాగళ్లు, పీఏబీఆర్, ఎంపీఆర్ నుంచి నీరు వృథా అవుతున్నాయని పేర్కొ న్నారు. ఇటీవల నిర్వహించిన ఐబీఏ సమావేశంలో కనీసం ఎన్ని రోజులు నీళ్లు వస్తాయి.. ఏ పంటలు వేసుకోవాలో కూడా చెప్పలేదన్నారు. కూటమి ప్రజా వ్యతిరేక విధానాలు, రైతాంగ సమస్యలపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.
పంచాయితీ చేస్తాం.. రండి అంటారా?
తమ భూముల్ని గద్దల్లా తన్నుకుపోతున్నారంటూ బాధితులు ఆవేదన చెందుతుంటే పంచాయితీలు చేస్తాం రండి అంటూ ఏకంగా ప్రకటనలు ఇస్తున్న ఘనత కూటమి పాలకులకే దక్కుతుందని ‘అనంత’ విమర్శించారు. బాధితులకు కలెక్టర్, ఎస్పీలు భరోసా ఇవ్వలేరా అని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో రేషన్, లిక్కర్ దందా జోరుగా సాగుతోందన్నారు. ఎమ్మెల్యే అనుచరులే భూదందాలకు పాల్పడుతున్నారని తెలిపారు. బుడగ జంగాలకు చెందిన భూములు, కృష్ణ ఇంగ్లిష్ మీడియం స్కూల్ యజమానులకు చెందిన భూములు లాక్కునే పరిస్థితి వచ్చిందన్నారు. సాయినగర్‌లో అధికార పార్టీకి చెందిన వాళ్లే నకిలీ రిజిస్ట్రేషన్ చేసుకుని స్థలం కాజేయాలని చూశారన్నారు. పాపంపేట భూముల విషయంలో ప్రజలు భయంతో వణికిపోతున్నారన్నారు. శింగనమల నియోజకవర్గంలోని పసలూరు, అనంతపురంలోని చిన్మయనగర్‌లో స్థలాలను ఎమ్మెల్యే అనుచరులే ఆక్రమించుకుంటున్నారన్నారు. బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఓబిరెడ్డి, నాగన్న, రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
