 
															కరువు కోరల్లో జిల్లా రైతులు
జిల్లా రైతులు కరువు కోరల్లో చిక్కుకున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ‘అనంత’ తెలిపారు. మోంథా తుపాను ప్రభావంపై వైఎస్సార్‌సీపీ జిల్లాల అధ్యక్షులు, రీజినల్ కో ఆర్డినేటర్లతో గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరా తీశారు. జిల్లాకు సంబంధించి వివరాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు ‘అనంత’ అధినేతకు వివరించారు.చంద్రబాబు–కరువు రెండూ కవల పిల్లలని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పేవారని, ఆ పరిస్థితి నేడు మళ్లీ జిల్లాలో నెలకొందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లించడంతో రైతులకు ఇబ్బంది లేకుండా పోయిందని గుర్తు చేశారు.
కొన్ని మండలాలపై ప్రభావం
జిల్లాలో మోంథా తుపాన్ ప్రభావం ఉరవకొండ, గుంతకల్లు, రాయదుర్గం, శెట్టూరు, బొమ్మన హాళ్, బ్రహ్మసముద్రం, విడపనకల్లు మండలాలపై పడిందని ‘అనంత’ తెలియజేశారు. బొమ్మనహాళ్ మండలం హరేసముద్రం, బుక్కరాయసముద్రం మండలం నీలాంపల్లిలో రెండు ఇళ్లు కూలిపోయాయన్నారు. వేదవతి హగరి నదుల్లో వరద కారణంగా పరివాహక ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయన్నారు. గుమ్మఘట్ట, కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో కొన్ని చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. ఉరవకొండలోని పలు కాలనీల్లో నేతన్నల మగ్గాల గుంతల్లోకి నీరు చేరడంతో నష్టం కలిగిందని పేర్కొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
