 
															ఫసల్.. ఫైసల్
● రైతులకు శాపంగా మారిన సర్కారు నిర్లక్ష్యం
● అవగాహన లేక తోచిన విధంగా బీమా ప్రీమియం చెల్లించిన రైతులు
● సవరణకు అవకాశం ఇస్తేనే ప్రయోజనం
అనంతపురం అగ్రికల్చర్: రైతులకు కొండంత భరోసానివ్వాల్సిన బీమా పథకాలు మాయగా మారుతున్నాయి. కూటమి సర్కారు నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యం వెరసి రైతులకు ఫలాలు అందని ద్రాక్షగా మారే దుస్థితి దాపురించింది. ఖరీఫ్ మొదలు కాకమునుపే పంట రుణాల రెన్యువల్స్ ప్రారంభం కావడంతో కొందరు వేరుశనగ, మరికొందరు కంది, పత్తి, ఆముదం పంటలకు, ఇంకొందరు ఉద్యాన పంటలకు బీమా ప్రీమియం చెల్లించారు. ఆ తర్వాత ప్రీమియం కట్టిన పంటను కాకుండా ఇతర పంటలు వేశారు. వేరుశనగకు ప్రీమియం కట్టిన రైతులు కంది లేదా ఆముదం, పత్తి లాంటి పంటలు, కందికి కట్టిన రైతులు వేరుశనగ లేదా ఇతర పంటలు సాగు చేశారు. అయితే, ప్రీమియం చెల్లించిన పంటనే ఈ–క్రాప్‌లోకి చేర్చాల్సి రావడం, ఈ–క్రాప్‌లో ఒక పంట, ప్రీమియం మరో పంటకు ప్రీమియం చెల్లించడంతో రైతులకు బీమా అందడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు.
2.34 లక్షల హెక్టార్లకు..
జిల్లాలో 1.49 లక్షల మంది రైతులు 2.34 లక్షల హెక్టార్ల పంటలకు ప్రీమియం కట్టి ఫసల్ బీమా, వాతావరణ బీమా పరిధిలోకి వచ్చారు. ఖరీఫ్‌లో 12 రకాల పంటలకు బీమా పథకం అమలు చేస్తుండగా అందులో పంట దిగుబడుల ఆధారంగా ప్రధానమంత్రి ఫసల్‌బీమా కింద కంది, వరి, జొన్న, మొక్కజొన్న, ఆముదం, ఎండుమిరపకు వర్తింపజేశారు. కంది రైతులు ఎకరాకు రూ. 80, వరి రూ.164, జొన్న రూ.84, మొక్కజొన్న రూ.132, ఆముదం రూ.80, ఎండుమిరపకు రూ.576 ప్రకారం ప్రీమియం చెల్లించారు. ఇక వాతావరణ బీమా పథకం వేరుశనగ, పత్తి, దానిమ్మ, బత్తాయి, టమాట, అరటికి వర్తింప జేశారు. ఇందులో వేరుశనగ ఎకరాకు రూ.640 ప్రకారం, పత్తికి రూ.1,140, దానిమ్మకు రూ.3,750, చీనీ, బత్తాయికి రూ.2,750, టమాటాకు రూ.1,600, అరటికి రూ.3 వేల ప్రకారం రైతులు చెల్లించారు.
తోచినట్లుగా చెల్లింపు
పంట రుణాలు ముందుగానే మొదలు కావడం, అధికారులు అవగాహన కల్పించని కారణంగా రైతులు తమకు తోచిన విధంగా ప్రీమియం చెల్లించినట్లు తెలిసింది. వ్యవసాయశాఖ సమాచారం ప్రకారం 1,49,261 మంది రైతులు 2,34,220 హెక్టార్లకు ప్రీమియం చెల్లించారు. ఇందులో వాతావరణ బీమా పంటలకు సంబంధించి 1,29,336 మంది రైతులు 2,03,160 హెక్టార్లకు ప్రీమియం కట్టారు. అలాగే ఫసల్ బీమాకు సంబంధించి కేవలం 19,925 మంది 31,064 హెక్టార్లకు మాత్రమే డబ్బు చెల్లించారు. ఫసల్ బీమా కింద గుర్తించిన కంది 1.04 లక్షల హెక్టార్లు, వరి 25 వేలు, జొన్న వెయ్యి హెక్టార్లు, మొక్కజొన్న 29 వేలు, ఆముదం 16 వేలు, ఎండుమిరప 9 వేల హెక్టార్లు... ఈ ఆరు పంటలు ఏకంగా 1.85 వేల హెక్టార్లలో సాగు చేశారు. కానీ, ప్రీమియం కట్టింది 31,064 హెక్టార్లకే కావడంతో కంది, ఆముదం రైతులకు అన్యాయం జరిగే పరిస్థితి నెలకొంది. వాతావరణ బీమా కింద వేరుశనగ 91 వేల హెక్టార్లు, పత్తి 26 వేల హెక్టార్లు మొత్తంగా 1.17 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. వాతావరణ బీమా కింద సాగు కన్నా చాలా అధికంగానే 2.03 లక్షల హెక్టార్లకు ప్రీమియం కట్టారు. అంటే వేల సంఖ్యలో రైతులు వాతావరణ బీమాకు ప్రీమియం చెల్లించినా అందులో చాలా మంది ఫసల్‌బీమా పంటలు సాగు చేసినట్లు స్పష్టమవుతోంది. అటు ప్రీమియం రూపంలో అధికంగానే చెల్లించినా... పరిహారం అసలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. బ్యాంకుల్లో వివరాల సవరణకు అవకాశం కల్పిస్తే మేలని రైతులు చెబుతున్నారు. మరి కూటమి సర్కారు, జిల్లా యంత్రాంగం, వ్యవసాయశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి.
 
							ఫసల్.. ఫైసల్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
