 
															బాబు ప్రభుత్వానివన్నీ డ్రామాలే
● మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజం
పుట్లూరు: రైతుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానివన్నీ డ్రామాలేనని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ మండిపడ్డారు. గురువారం పుట్లూరు ప్రధాన రోడ్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదనుకు విత్తనాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. విత్తన పంపిణీ చేపట్టాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న సమయంలో విత్తన రిజిస్ట్రేషన్లు గురువారం నుంచి ప్రారంభించామని వ్యవ సాయ అధికారి కాత్యాయని తెలపడంపై మండిపడ్డారు. మండలానికి 2,200 క్వింటాళ్ల విత్తనాలు వచ్చినట్లు చెబుతున్నారని, వాటిని ఎక్కడ నిల్వ చేశారో చెప్పాలని నిలదీశారు. ఈ క్రమంలోనే ఏపీ సీడ్స్ అధికారులకు మాజీ మంత్రి ఫోన్ చేయగా ఇప్పటివరకు పుట్లూరు మండలం నుంచి ఎలాంటి ఇండెంట్ రాలేదని వారు చెప్పడంతో అధికారులు కంగుతిన్నారు. వైఎస్సార్‌సీపీ ధర్నా గురించి తెలియగానే రైతులను మభ్యపెట్టడానికి డ్రామాలు ఆడుతున్నట్లు స్పష్టమవుతోందని శైలజానాథ్ విమర్శించారు. రెండు రోజుల్లో రైతులకు సబ్సిడీపై విత్తన పప్పుశనగ అందించని పక్షంలో ప్రభుత్వ కార్యాలయాలను మూసివేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు పొన్నపాటి మహేశ్వరరెడ్డి, ప్రసాద్, రాష్ట్ర పార్లమెంట్ కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్య దర్శి వంశీగోకుల్‌రెడ్డి, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఫణీంద్ర,జిల్లా కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
