 
															శభాష్ లావణ్య..
● సర్వజనాస్పత్రికి 12 లీటర్ల తల్లిపాలను దానం చేసిన బాలింత
అనంతపురం మెడికల్: తన శిశువుకు పాలను పట్టిన తర్వాత మిగులు పాలతో నవజాత శిశులు ఆకలి తీర్చే అవకాశం ఉన్నా.. చాలా మంది బాలింతలు ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ గ్రామీణ బాలింత తన పాలను దానం చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 4న మరుట్ల గ్రామానికి కెందిన నవీన్‌కుమార్ భార్య లావణ్య సర్వజనాస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డకు పాలు ఇచ్చిన తర్వాత మిగులు పాలను మదర్ మిల్క్ బ్యాంక్‌కు ఇవ్వడం ద్వారా తల్లి పాలు తక్కువగా ఉన్న శిశువులకు అందించి ఆకలి తీర్చవచ్చునని బాలింతలకు డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలత పర్యవేక్షణలో న్యూట్రీషియనిస్టు పల్లవి, సిబ్బంది రాధ అవగాహన కల్పించారు. ఈ అంశంపై చైతన్యం పొందిన లావణ్య విషయాన్ని వెంటనే తన భర్తకు తెలిపి ఆయన అంగీకారంతో అడ్మిషన్‌లో ఉన్న సమయంలో రోజూ తన బిడ్డకు పాలను ఇచ్చిన తర్వాత మిగిలిన పాలను మదర్ మిల్క్ బ్యాంకుకు అందించారు. ఇదే స్ఫూర్తితో డిశ్చార్జ్ అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆమె కొనసాగిస్తూ పాలను తీసి భద్రపరుస్తూ వచ్చారు. సమాచారం అందుకున్న డిప్యూటీ ఆర్‌ఎంఓ హేమలత, న్యూట్రీషినిస్టు పల్లవి, రాధ.. గురువారం మరుట్ల గ్రామానికి చేరుకుని లావణ్య భద్రపరిచిన 12 లీటర్ల పాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా లావణ్య దాతృత్వాన్ని డాక్టర్ హేమలత కొనియాడారు. ఈ పాలను ఐసీడీఎస్ పర్యవేక్షణలో ఉండే అనాథ శిశువులతో పాటు సర్వజనాస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో అడ్మిషన్‌లో ఉన్న తల్లిపాలు లేని పిల్లలకు అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
