 
															మానవత్వం చాటుకున్న ఎస్‌ఐ
పెద్దపప్పూరు: నడవలేని స్థితిలో రోడ్డుపై పడిపోయిన వృద్ధుడిని కుటుంబసభ్యుల చెంతకు చేర్చి ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాలు... పెద్దపప్పూరుకు చెందిన 75 ఏళ్ల నాగయ్య పుట్టకతోనే అంధుడు. రైళ్లలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న అతనికి భార్య, ఒక్కగానొక్క కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేసిచ్చాడు. భిక్షాటన ద్వారా వచ్చిన సొమ్ములో దాదాపు రూ.6 లక్షలు ఖర్చు పెట్టి తాడిపత్రిలో ఇంటిని నిర్మించి, కుమార్తె పేరున రాయించి ఇచ్చాడు. ఈ క్రమంలో ఆదరించేవారు లేక వారం రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్న నాగయ్య... గురువారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నడవలేని స్థితిలో కుప్పకూలిపోయాడు. నిస్సహాయ స్థితిలో పడి ఉన్న అతన్ని గమనించిన స్థానిక ‘సాక్షి’ విలేకరి.. విషయాన్ని వెంటనే ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే ఎస్‌ఐ అక్కడకు చేరుకుని వృద్ధుడితో మాట్లాడారు. రెండు కాళ్లకు పుండ్లు ఏర్పడి నడవలేకపోతున్నానంటూ నాగయ్య కన్నీరుపెట్టుకున్నాడు. స్పందించిన ఎస్‌ఐ వెంటనే కుటంబసభ్యులు గురించి ఆరా తీసి తన సొంత ఖర్చుతో వారి చెంతకు చేర్చారు. సకాలంలో స్పందించిన ఎస్‌ఐ చొరవను స్థానికులు అభినందించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
