అవిశ్వాసంపై టీడీపీ కుట్ర
● ఎంపీటీసీ సభ్యురాలి అపహరణ
● పోలీసులకు ఫిర్యాదు చేసిన బీకేఎస్ వైఎస్సార్‌సీపీ శ్రేణులు
బుక్కరాయసముద్రం: వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచి టీడీపీలోకి వెళ్లిన ఎంపీపీ సునీతపై ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాసం నెగ్గకుండా టీడీపీ నాయకులు కుట్ర పన్నారని జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంతరెడ్డి మండిపడ్డారు. మెజారిటీ లేకపోవడంతో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేశారని, ఇది ఫలించకపోవడంతో ఓ ఎంపీటీసీ సభ్యురాలిని బలవంతంగా ఇంటిని పిలుచుకెళ్లి రాజకీయాల్లో నైతికతకు పాతరవేశారంటూ ధ్వజమెత్తారు. ఎంపీటీసీ సభ్యురాలి అపహరణను నిరసిస్తూ గురువారం బీకేఎస్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం సీఐ పుల్లయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్, గువ్వల శ్రీకాంతరెడ్డి మాట్లాడారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 19 స్థానాలకు గాను 14 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎంపీటీసీలుగా గెలిచారని గుర్తు చేశారు. ఆ సమయంలో సునీత, కాలువ వెంకటక్ష్మి చెరో రెండేళ్లు ఎంపీపీ పదవిలో కొనసాగేలా పెద్దలు నిర్ణయించారన్నారు. అయితే ఈ ఒప్పందాన్ని సునీత ఉల్లంఘించి గత సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీలోకి చేరారన్నారు. ఆ తర్వాత సునీతను పార్టీ నుంచి సస్సెండ్ చేస్తున్నట్లుగా, తమ పార్టీకి ఆమెకు ఎలాంటి సంబంధం లేదని శింగనమల నియోజకవర్గ టీడీపీ అబ్జర్వర్ ప్రకటించారన్నారు. అయినా రాజకీయ నైతికతకు ఎమ్మెల్యే బండారు శ్రావణి పాతరేస్తూ సునీతను ఎంపీపీగానే కొనసాగిస్తూ వచ్చారన్నారు. దీంతో గత నెల 26న ఆమైపె అవిశ్వాసం పెట్టాలంటూ కలెక్టర్‌తో పాటు ఆర్డీఓకు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు విన్నవించారన్నారు. ఈ అంశంపై స్పందించిన అధికారులు ఈ నెల 30 అవిశ్వాస తీర్మానం పెట్టేలా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించి భంగపడ్డారన్నారు. గురువారం అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలిని బలవంతంగా ఇంటి నుంచి పిలుచుకుని వెళ్లిపోయారని, ఇందుకు బాధ్యులైన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


