ఆ టెండర్ల రద్దు తప్పదు
బుక్కరాయసముద్రం: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు వేసే టెండర్లను తమ ప్రభుత్వం వచ్చాక తప్పకుండా రద్దు చేస్తామని వైఎస్సార్ సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని దయ్యాలకుంటపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు కేవలం ధనార్జనపైనే దృష్టి పెట్టారన్నారు. టీడీపీ కార్యకర్తలకు ఎలా దోచిపెట్టాలనే ఆలోచనతోనే నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాలలను అభివృద్ధి చేయాల్సింది పోయి ప్రైవేటీకరణ చేయాలని చూడడం సిగ్గుచేటన్నారు. ఎవరు టెండర్లు వేసినా తాము అధికారంలోకి వచ్చాక అన్నీ రద్దు చేస్తామని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇది వరకే ప్రకటించారన్నారు. పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలతో పాటు పేద విద్యార్థులను డాక్టర్లు చేసేలా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్యమంలా జరుగుతోందని, త్వరలో గవర్నర్‌ను కలుస్తామని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్పుడప్పుడు అధికారుల ముందు షో చేయడం, ఆ తర్వాత వెళ్లిపోవడం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ నెల 28న శింగనమలలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నామని, వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులతో పాటు ప్రజలు కూడా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ నాగరత్నమ్మ, పార్టీ బీకేఎస్, శింగనమల, నార్పల, పుట్లూరు, యల్లనూరు గార్లదిన్నె అధ్యక్షులు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, పూల ప్రసాద్, ఖాదర్‌వలి, మహేశ్వరరెడ్డి, ఎల్లారెడ్డి, శంకర్, జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, అనంతపురం పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి సత్య నారాయణరెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ముసలన్న, ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీలు నాగేశ్వర రావు, యోగీశ్వరి, రాదా మనోహర్‌రెడ్డి, పూల నారాయణస్వామి, పార్వతి, చికెన్ నారాయణస్వామి, నాగిరెడ్డి, నరేష్, వైఎస్సార్ సీపీ నాయకులు, అనుబంధ సంఘాల కన్వీనర్లు పాల్గొన్నారు.
దోచుకోవడానికే చంద్రబాబు ప్రైవేటీ కరణ జపం
మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజం


