
పేరుకే 100 .. ఉండేది 50 !
రాయదుర్గం: స్థానిక ఏరియా ఆస్పత్రిని సమస్యలు నీడలా వెన్నాడుతున్నాయి. వైద్యులు, సిబ్బంది కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2021లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసింది. రూ.17 కోట్ల వ్యయంతో భవన నిర్మాణ పనులు చేపట్టారు. రెండేళ్ల పాటు పనులు చకచక సాగాయి. దాదాపు 85 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఎన్నికల కోడ్ అడ్డురావడం... ఆ తర్వాత ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో పనులు పూర్తిగా పడకేశాయి. దీంతో పేరుకే 100 పడకలైనా 50 పడకలతోనే సర్దుకోవాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు.
ఒకే బెడ్డుపై ముగ్గురు
రాయదుర్గం మండల వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృంభించాయి. ఈ నేపథ్యంలో ఏరియా ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. సాధారణ రోజుల్లో 500 నుంచి 600 నమోదయ్యే ఓపీ.. ప్రస్తుతం800 నుంచి వెయ్యికి పైగా ఉంటోంది. రోగులను అడ్మిట్ చేస్తే ఒకే బెడ్డుపై ఇద్దరు లేదా ముగ్గురిని ఉంచాల్సి వస్తోంది. సౌకర్యాలు లేక రోగుల సహాయకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆరుబయట నిద్రిస్తే దోమల ఉధృతి కారణంగా మరుసటి రోజే అస్వస్థతకు గురవ్వాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైద్యుల్లేక ఇబ్బంది
సరిపడ వైద్యులు, సిబ్బందిలేక అత్యవసర విభాగాలతో పాటు ఓపీ సేవల్లోనూ ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. 23 మంది వైద్యులు ఉండాల్సిన ఈ ఆస్పత్రిలో కేవలం 10 మందితోనే నెట్టుకొస్తున్నారు. దీంతో ఓపీ వేళల్లో వైద్యులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. నర్సింగ్, ఇతర విభాగాల్లో 73 మంది ఉండాలి. కేవలం 20 మంది మాత్రమే ఉంటున్నారు. రోజు వెయ్యి మంది రోగులు ఓపీ సేవలను అందుకుంటున్నారు.
ఆగిన రాయదుర్గం ఏరియా ఆస్పత్రి భవన నిర్మాణం
ఒక బెడ్డుపై ఇద్దరు ముగ్గురు సర్దుకుంటున్న రోగులు
ఏళ్లుగా సాగుతున్న వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులు
రాయదుర్గం ఏరియా ఆస్పత్రిని వీడని సమస్యలు
పట్టించుకోని కూటమి సర్కారు
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవమే. రోగులకు ఇబ్బంది కలగకుండా వైద్యం అందిస్తున్నాం. నూతన ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తి చేసేలా కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తీసుకొస్తాం. కొత్త ఆస్పత్రి ప్రారంభమైతే మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
– డాక్టర్ మెర్సీ జ్ఞానసుధ,
ఆస్పత్రి సూపరింటెండెంట్, రాయదుర్గం
వైద్యులను నియమించాలి
రాయదుర్గం ఏరియా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. వెంటనే వైద్యులను నియమించాలి. గత ప్రభుత్వంలో 100 పడకల ఆస్పత్రిగా అప్‌డేట్ చేశారు. రూ.17 కోట్లతో నూతన భవనం నిర్మాణ పనులు చేపట్టారు. 85 శాతం పనులు పూర్తయాయి. మిగిలిన 15 శాతం పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
– గోనబావి లుబ్నగజాల, కౌన్సిలర్, రాయదుర్గం
ఒక్కో బెడ్డుపై ఇద్దరు
పేరుకే వంద పడకల ఆస్పత్రి. ఇక్కడ ఒక్కో బెడ్డుకు ఇద్దరు, ముగ్గురిని కేటాయించి చికిత్స చేస్తున్నారు. నూతన ఆస్పత్రి భవన నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా 50 పడకలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. సరైన సౌకర్యాలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. – కొట్రేష్,
ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు, రాయదుర్గం

పేరుకే 100 .. ఉండేది 50 !

పేరుకే 100 .. ఉండేది 50 !

పేరుకే 100 .. ఉండేది 50 !

పేరుకే 100 .. ఉండేది 50 !