లేని ఖాళీ చూపించి.. వేదన మిగిల్చి
అనంతపురం ఎడ్యుకేషన్: టీచర్ల బదిలీల్లో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. ఒక స్కూల్‌లో ఖాళీ లేకపోయినా ఉన్నట్లు చూపించారు. అక్కడ కోరుకున్న టీచరుకు అసలు విషయం ఆలస్యంగా తెలిసి లబోదిబోమంటున్నారు. ఏర్పడే ఖాళీల్లో కేటాయించి న్యాయం చేస్తామంటూ అధికారులు భరోసా ఇచ్చినా... బాధిత టీచరులో మాత్రం తీవ్ర ఆందోళన నెలకొంది. శనివారం రాత్రి కౌన్సెలింగ్ కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. శెట్టూరు మండలం బలపంపల్లి పాఠశాలలో పని చేస్తున్న వరలక్ష్మీ 8 ఏళ్లు సర్వీస్ పూర్తి కావడంతో తప్పనిసరి బదిలీ కావాల్సి ఉంది. ఈ క్రమంలో సీనియార్టీ జాబితాలో సీరియల్ నంబరు 2,109లో ఉన్న ఆమె శనివారం రాత్రి కౌన్సెలింగ్‌కు హాజర య్యారు. ఆప్షన్లు తీసుకునే క్రమంలో గుత్తి మండలం ఓపెన్ చేయాలని కోరారు. ఆ మండలంలో మామడూరు పాఠశాలలో ఖాళీ చూపించడంతో ‘ఆప్ట్’ చేసుకున్నారు. అధికారులు ధ్రువీకరించి సంతకం కూడా తీసుకున్నారు. వాస్తవానికి మామడూరు పాఠశాలలో నాలుగు మంజూరు పోస్టులున్నాయి. ఇందులో ఒకరు పని చేస్తుండగా మూడు క్లియర్ వేకెన్సీలున్నాయి. ఈ మూడు ఖాళీలను అంతకముందే కోరుకున్నారు. సాంకేతిక సమస్య కారణంగా మరో ఖాళీ ఉన్నట్లు చూపిస్తోంది. ఈ విషయం విద్యాశాఖ అధికారులతో పాటు సిబ్బందికి, సాంకేతిక నిపుణులకూ తెలుసు. వరలక్ష్మీ కోరుకునే సమయంలో వీరెవరూ గుర్తించలేదు. తీరా కోరుకుని నిర్ధారణ పూర్తయిన తర్వాత తేరుకున్నారు. పోస్టు లేని స్కూల్‌కు వెళ్తే జీతం సమస్య ఉత్పన్నమవుతుంది. దీంతో బాధితురాలు లబోదిబోమంటూ డీఈఓ వద్ద మొరపెట్టుకున్నారు. పొరబాటు జరిగిందని బదిలీల్లో ఏర్పడే ఖాళీల్లో కేటాయిస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు.
నేటి కౌన్సెలింగ్ వేదిక మార్పు..
ఆర్డీటీ అంధుల పాఠశాల నుంచి ఆదివారం పంగల్ రోడ్డు సమీపంలోని సెయింట్ విన్సెంట్ డీపాల్ స్కూల్‌కు కౌన్సెలింగ్ కేంద్రం మార్పు చేస్తున్నట్లు డీఈఓ ప్రసాద్‌బాబు ప్రకటించారు. ఉదయం 10 గంటలకు సీనియార్టీ జాబితాలో క్రమసంఖ్య 3,001 నుంచి 3,500 హాజరుకావాలని, సాయంత్రం 4 గంటలకు 3,501 నుంచి 3,881 వరకు హాజరుకావాలన్నారు.ఉర్దూ,కన్నడ బదిలీలు కూడా చేపట్ట నున్నట్లు తెలిపారు. బదిలీ అయిన పీడీలు, పీఈటీలు ఆదివారం స్కూళ్లల్లో చేరాలని డీఈఓ ఆదేశించారు.


