ఆర్టీసీ అధికారులపై కలెక్టర్ సీరియస్
అనంతపురం క్రైం: కలెక్టర్ వినోద్‌కుమార్ ఎట్టకేలకు స్పందించారు. ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు డిపో, పరిసరాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ప్రతి సమస్యనూ అడిగి తెలుసుకుని ఏళ్ల తరబడి పట్టించుకోకుండా అలాగే ఎందుకు వదిలేశారంటూ సంస్థ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ డిపో లోపల డ్రెయినేజీ కాలువ మొత్తం చెత్తతో నిండి కంపుకొడుతున్న విషయాన్ని గుర్తించి వెంటనే జేసీబీలను రప్పించి శుభ్రం చేయించారు. బస్టాండు ప్రధాన ద్వారం వద్ద పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. బస్టాండు ఆవరణమంతా గుంతల మయంగా మారి వర్షపు నీరు నిండి ఉండటాన్ని గమనించి మట్టితో గుంతలను పూడ్చాలని సూచించారు. ఫ్లాట్‌ఫాంల వద్ద ప్రయాణికులను కలసి సమస్యలపై ఆరా తీశారు. ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించక పోతే ఎలా అని ప్రశ్నించారు. అధిక ధరలకు స్నాక్స్ విక్రయిస్తున్న రెండు దుకాణాలను గుర్తించి రూ.25 వేలు జరిమానా విధించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ప్రతి స్టాల్ నిర్వాహకుడు తప్పనిసరిగా దుకాణం ముందు డస్ట్‌బిన్‌ను ఏర్పాటు చేయకపోతే జరిమానా విధించాలన్నారు. ఇకపై పరిస్థితుల్లో మార్పురాకపోతే చర్యలు తప్పవని ఆర్టీసీ అధికారులను హెచ్చరించారు.


