
ఇక 9 రకాల పాఠశాలలు
●నూతన విధానాలు ప్రకటించిన ప్రభుత్వం ●పాఠశాలల పునర్విభజన, క్రమబద్ధీకరణకు జీఓలు
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖలో 9 రకాల పాఠశాలలు పుట్టుకొచ్చాయి. ఈ మేరకు ప్రభుత్వం విధి విధానాలను ప్రకటించింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలల పునర్విభజన, క్రమబద్ధీకరణకు మంగళవారం జీఓలు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన జాబితాలను అనంతపురం శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో రెడీ చేస్తున్నారు. గతంలో 117 జీఓను అనుసరిస్తూ ప్రాథమిక పాఠశాలల్లోని 3,4.5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. 1,2 తరగతులను ఫౌండేషన్ స్కూళ్లుగా మార్చారు. కూటమి ప్రభుత్వంలో 117 జీఓ రద్దు తర్వాత చాలా వరకు ఫౌండేషన్ స్కూళ్లను అలానే ఉంచారు. 3,4,5 తరగతులను సమీపంలోని మరో ప్రాథమిక పాఠశాలల్లోకి విలీనం చేశారు.
ఇవీ పాఠశాలలు...
శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1,పీపీ–2), ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2, 1–2 తరగతులు), బేసిక్ ప్రైమరీ పాఠశాలలు (పీపీ–1, పీపీ–2,1–5 తరగతులు), మోడల్ ప్రైమరీ పాఠశాలలు (పీపీ–1, పీపీ–2, 1–8 తరగతులు), ఉన్నత పాఠశాలలు (6–10 తరగతులు), ఉన్నత పాఠశాలలు (1–10 తరగతులు), హైస్కూల్ ప్లస్ (6–12 తరగతులు), హైస్కూల్ ప్లస్ (1–12 తరగతులు).
జిల్లాలో ఏయే స్కూళ్లు ఎన్నంటే...
శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1 నుంచి 2వ తరగతి వరకు)–92, బేసిక్ ప్రైమరీ పాఠశాలలు (పీపీ–1–5 తరగతులు, 1–5 తరగతులు) 621, మోడల్ ప్రైమరీ పాఠశాలలు (పీపీ–1–5, 1–5 తరగతులు) 626, ప్రాథమికోన్నత పాఠశాలలు (1–7/8 తరగతులు) 59, ఉన్నత పాఠశాలలు (6–10 తరగతులు) 338 పాఠశాలలుగా మారాయి. మొత్తం 1,736 పాఠశాలలుగా ఏర్పాటు చేయనున్నారు.
ఆ పాఠశాలల హెచ్‌ఎంలుగా ఎస్‌ఏలు
నూతన విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా 4,556 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం/స్కూల్ అసిస్టెంట్‌గా కన్వర్షన్ చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో 520 పోస్టులను సృష్టించారు. ఎంపీపీ, జెడ్పీ పాఠశాలల్లో 515, ప్రభుత్వ పాఠశాలల్లో 5 పోస్టులను కన్వర్షన్ చేశారు. ప్రస్తుతం ఆయా స్కూళ్లలో పని చేస్తున్న ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంల గురించి స్పష్టత ఇవ్వలేదు. అలాగే జిల్లాలో మరో 34 (ఎంపీపీ, జెడ్పీ–31, ప్రభుత్వం–3) స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అదే మేనేజ్‌మంట్ స్కూళ్లలో కన్వర్షన్ చేశారు. అయితే ఏయే సబ్జెక్టులనేది అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.