
అద్దె బస్సులపై ఆరా
● ఆర్టీసీ అధికారులు కళ్లు మూసుకున్నారా!
● ఏటా ఎంత నష్టమొచ్చిందో లెక్కలు తేల్చండి
● అద్దెబస్సుల టోల్ రాయితీ లెక్కగట్టే పనిలో విజి‘లెన్స్’
● 2,788 అద్దెబస్సుల జాబితాను పరిశీలిస్తున్న అధికారులు
● నెలవారీ సమీక్షలో ఆరా తీసిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు
అనంతపురం క్రైం: ఆర్టీసీలో అద్దె బస్సుల టోల్ చెల్లింపు రాయితీలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారంపై ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. బుధవారం విజయవాడ బస్ భవన్‌లో నిర్వహించిన నెలవారీ సమీక్షలో అనంతపురం రీజియన్‌లో అద్దె బస్సుల టోల్ రాయితీ వ్యవహారం హాట్ టాపిక్‌గా నిలిచింది. సమీక్షకు హాజరైన అనంతపురం రీజియన్ సిబ్బంది, అధికారులు, యూనియన్ నేతల ద్వారా అంత్యంత విశ్వసనీయ సమాచారం ఇలా ఉంది... మంగళవారం ‘ఆర్టీసీలో అధికారులే టో(తో)లు తీశారు..’అంటూ సాక్షిలో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. రాష్ట్ర వ్యాఫ్తంగా అద్దె బస్సుల జాబితాను పరిశీలించాలని సూచించారు. డిపోల వారిగా అద్దె బస్సులు, వాటి రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్ టెండరు నిర్వహణలో ప్రతి అంశాన్నీ పరిశీలించాల్సిన ఈడీ, ఆర్‌ఎం క్యాడర్ అధికారుల తప్పిదం ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని వివరించారు. అనంతపురం ఆర్టీసీ రీజియన్‌లో ఆరు నెలల క్రితమే ఈ విషయం బయటకు పొక్కినా సదరు అధికారులు ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదని ఆరా తీసినట్లు తెలిసింది. కార్పొరేషన్‌కు రోజువారీ వస్తున్న నష్టాన్ని పూడ్చాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం. ఒక్క అనంతపురం రీజియన్‌లోనే సుమారు రూ.5 కోట్లు నష్టపోయినట్లు తేలితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ నష్టం ఏమేరకు ఉంటుందో తక్షణం ఆరా తీయాలని సూచించినట్లు తెలిసింది.
అద్దె బస్సుల యజమానులకు నోటీసుల జారీ
రాష్ట్ర వ్యాఫ్తంగా నాలుగు జోన్‌ల పరిధిలో 2,788 అద్దె బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సులు రోజువారీ ఎన్ని సింగిల్స్ తిరుగుతున్నాయి. ఎన్ని టోల్ గేట్లను దాటుకుని పోతున్నాయన్న దానిపై వివరాలు సేకరించాలని అకౌంట్స్ విభాగాలకు ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలందినట్లు సమాచారం. తక్షణం అద్దె బస్సులు స్థానిక జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఉంటే సదరు బస్సు యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఏదేమైనా ఇంత పెద్ద నష్టానికి కారకులైన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా? లేక సర్దుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది.
టోల్ రాయితీ నష్టంపై విజి‘లెన్స్’
అనంతపురం ఆర్టీసీ రీజియన్ పరిధిలో అద్దె బస్సుల టోల్ రాయితీ పొందలేక పోవడానికి ప్రధాన కారణం లోకల్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడమే కారణమని ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ మేరకు డిపోల వారీగా అద్దె బస్సుల వివరాలను సేకరించింది. ఈ మేరకు నివేదికను ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపింది. కాగా ఎంత మేరకు నష్టం జరిగిందన్న వివరాలను ఇంకా సేకరిస్తున్నామని ఆర్టీసీ విజిలెన్స్ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు.

అద్దె బస్సులపై ఆరా

అద్దె బస్సులపై ఆరా