
జంట హత్యల కేసులో మరొకరు లొంగుబాటు
రాప్తాడు: జంట హత్యల కేసులో ఆరుగురు నిందితుల అరెస్టు తర్వాత.. తాజాగా మరొకరు కోర్టులో లొంగిపోయారు. వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 17న రాప్తాడు మండలం గొల్లపల్లికి చెందిన రైతు చిగిచెర్ల నారాయణరెడ్డి, ముత్యాలమ్మ దంపతులపై టీడీపీ కార్యకర్తలు వేట కొడవళ్లు, కట్టెలతో దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి, మృతుడు నారాయణరెడ్డి కుమారుడు ప్రదీప్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారు. అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు ప్రత్యేక బృందాలతో వేట ప్రారంభించడంతో ఈ నెల 19న ఆరుగురు నిందితులు రాప్తాడుకు చెందిన పామల్ల ధనుంజయ, పామల్ల ఇంద్రశేఖర్, నీరుగంటి నిరంజన్‌రెడ్డి, దండు నరేంద్ర, గంగలకుంటకు చెందిన బుడగ లక్ష్మీనారాయణ, అనంతపురం రూరల్ మండలం కందుకూరుకు చెందిన దయ్యం హన్మంత్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ నెల 20న వారిని రిమాండ్‌కు తరలించారు. మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక పోలీసుబృందాలు గాలిస్తున్నాయి. హత్య జరిగిన సమయంలో గాయపడిన పామాల కొండప్ప అనే నిందితుడు అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన నలుగురు నిందితులు మొబైల్ ఫోన్లు స్విచాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం పోట్లమర్రికి చెందిన బాల నరసింహారెడ్డి బుధవారం కోర్టులో లొంగిపోయాడని సీఐ శ్రీహర్ష తెలిపారు. కోర్టు ఉత్వర్వుల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. పరారీలో ఉన్న నిందితులు రాప్తాడుకు చెందిన పామల్ల పండయ్య, పామాల్ల కొండప్ప, గొనిపట్ల శీనా, పాత్రికేయుడు గొల్లపల్లికి చెందిన పెద్దింటి జగదీష్‌ను త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు.
రాయదుర్గం విద్యార్థినికి
‘షైనింగ్ స్టార్’ అవార్డు
రాయదుర్గంటౌన్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 587/600 మార్కులతో ప్రతిభ కనబరచిన రాయదుర్గం కేజీబీవీ విద్యార్థిని ఎన్.అక్షయ ‘షైనింగ్ స్టార్’ అవార్డుకు ఎంపికయ్యింది. బుధవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ అవార్డును అక్షయ అందుకుంది. గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రాన్ని అందజేసి కేజీబీవీ ప్రిన్సిపాల్ వెంకటలక్ష్మితోపాటు విద్యార్థిని తల్లిదండ్రులు గంగమ్మ, మల్లికార్జునలను అభినందించారు.