
వడదెబ్బతో మహిళ మృతి
ఆత్మకూరు: వడదెబ్బకు గురై మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. ఆత్మకూరుకు చెందిన ఉరుముల రామాంజినమ్మ (59) సోమవారం తనకు ఉన్న రెండు ఆవులను తోలుకొని మేత కోసం పొలంలోకి వెళ్లింది. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆమెకు కోసం వెతికారు. పొలం వద్ద స్పృహ కోల్పోయి పడి ఉన్న ఆమెను హుటాహుటిన ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే రామాంజినమ్మ మరణించినట్లు వైద్యులు తెలియజేశారు. రామాంజినమ్మకు భర్త, కుమారుడు ఉన్నారు.
‘శ్రీరామిరెడ్డి’ కార్మికులతో అధికారుల చర్చలు విఫలం
కూడేరు: శ్రీరామిరెడ్డి పథకం కార్మికులతో అధికారులు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. మండలంలోని పీఏబీఆర్ సమీపంలో ఏర్పాటైన శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ వద్ద కార్మికులతో మంగళవారం అనంతపురం ఆర్డీఓ కేశవ నాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సురేష్ చర్చలు జరిపారు. పెండింగ్‌లో ఉన్న ఆరు నెలల వేతనాలను ఈ నెల 17న, పీఎఫ్ ఈ నెలాఖరుకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అందుకు కార్మికులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు అంగీకరించలేదు. 38 రోజులుగా సమ్మెలో ఉన్నామని, వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేసే దిశగానే మాట్లాడితే ఎలా.. అని ఓబులు ప్రశ్నించారు. ‘సమ్మెలోకి వెళ్లిన ప్రతిసారీ ఫలానా గడువులోపు ఇస్తామంటారు.. మళ్లీ స్పందించరు.. మీ హామీలపై నమ్మకం లేదు, కార్మికులు సమ్మె కొనసాగిస్తారు’ అని ఓబులు స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ మురళీధర్, డీఈ శిరీషా, తహసీల్ధార్ మహబూబ్ బాషా, సర్వేయర్ అయేషా సిద్దికీ, శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ జిల్లా యూనియన్ అధ్యక్షుడు ఎర్రిస్వామి, కార్మికులు కొండారెడ్డి, రామాంజనేయులు, నాగరాజు, వన్నూరు స్వామి తదితరులు పాల్గొన్నారు.