సౌకర్యాలు పట్టించుకునే వారేరీ? | - | Sakshi
Sakshi News home page

సౌకర్యాలు పట్టించుకునే వారేరీ?

May 6 2025 1:16 AM | Updated on May 6 2025 1:16 AM

సౌకర్

సౌకర్యాలు పట్టించుకునే వారేరీ?

అనంతపురం మెడికల్‌: పోషకాహార పునరావాస కేంద్రం (న్యూట్రీషియన్‌ రీహ్యాబిలిటేషన్‌ సెంటర్‌–ఎన్‌ఆర్‌సీ)లో చిన్నారుల ఆకలికేకలు మిన్నంటుతున్నాయి. తీవ్రమైన పోషకాహార లోపం ఉన్న పిల్లలను 14 రోజుల పాటు ఎన్‌ఆర్‌సీలో ఉంచి వారు బరువు పెరిగాక డిశ్చార్జ్‌ చేస్తుంటారు. తల్లులకు పోషకాహారం, వైద్యం, సంరక్షణ గురించి ఇక్కడ అవగాహన కల్పిస్తుంటారు. అయితే వైద్య ఆరోగ్యశాఖాధికారుల బాధ్యతారాహిత్యంతో ఎన్‌ఆర్‌సీ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి.

ఎన్‌ఆర్‌సీలో సేవలు..

పౌష్టికాహార లోపంతో బక్కచిక్కిన చిన్నారులకు ఎన్‌ఆర్‌సీలో వైద్యులు, డైటీషియన్‌, స్టాఫ్‌నర్సుల పర్యవేక్షణలో రెండు వారాల పాటు వైద్య చికిత్సలందిస్తారు. రోజూ ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రతి రెండు గంటలకు ఒకసారి చిన్నారులకు డైట్‌ (ఆహారం) ఇస్తారు. ఉదయం 6 గంటలకు పాలు/రాగిమాల్ట్‌, 8 గంటలకు పాయసం/ సగ్గుబియ్యం, వేరుశనగ పచ్చడితో చపాతి, జొన్నరొట్టె, రాగిరొట్టె, 10 గంటలకు ఉడికించిన కోడిగుడ్డు/ పండు/ మొలకెత్తిన తింజలు, 12 గంటలకు రాగిముద్ద లేదా అన్నం పప్పుతో కూర, మధ్యాహ్నం 2 గంటలకు ఉడికించిన కూరగాయలు, 6 గంటలకు ఏదైనా పండు, 8 గంటలకు మధ్యాహ్నం భోజనం లాగే ఇవ్వాలి. రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలు ఇవ్వాలి.

ఆహార పంపిణీలో తీవ్ర జాప్యం

పోషకాహార పునరావాస కేంద్రం (ఎన్‌ఆర్‌సీ)లో చిన్నారులకు డైట్‌ అందించేందుకు ఇద్దరు వంట మనుషులు అవసరం. అయితే ఇక్కడ ఒక పోస్టు కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. ఉన్న ఒక్క వంట మనిషి ప్రసూతి సెలవులో వెళ్లారు. ఇక వంట చేయడానికంటూ ప్రత్యేకంగా మనుషులు లేరు. దీంతో ప్రతి రెండు గంటలకు ఒకసారి అందాల్సిన డైట్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. సకాలంలో ఆహారం అందక చిన్నారులు ఎదురు చూడడం.. కొందరు ఆకలికి నకనకలాడటం నిత్యకృత్యమైపోయింది.

అమ్మలా చూసుకుంటున్న స్టాఫ్‌నర్సులు

ఎన్‌ఆర్‌సీలోని వైద్యులు ఉదయం, మధ్యాహ్నం వరకు ఉండి తర్వాత పత్తా లేకుండా పోతున్నారు. ఇక స్టాఫ్‌నర్సులు తమ విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు చిన్నారుల ఆకలిదప్పులు తీర్చేందుకు వంట వండి పెడుతున్నారు. స్టాఫ్‌నర్సులు అందుబాటులో లేని సమయంలో అటెండర్‌ వంట వండాల్సి వస్తోంది. ఇదే విషయమై ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేస్తే..‘మీరు డీఎంహెచ్‌ఓ పరిధిలో ఉంటారు. ఉన్న వారితోనే సర్దుబాటు చేసుకోండి’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ఇక డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ భ్రమరాంబదేవి అయితే తమ కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వజనాస్పత్రి ఎన్‌ఆర్‌సీని ఏనాడూ పర్యవేక్షించిన దాఖలాలు లేవు. కేంద్రం ఎలా నడుస్తోందో.. సిబ్బందికి సలహాలు, సూచనలు కూడా ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది.

చిన్నారుల ఆకలి కేకలు

ఎన్‌ఆర్‌సీలో సౌకర్యాలు నిల్‌

వంట చేయడానికి మనుషులేరీ?

తప్పని పరిస్థితుల్లో వంట చేస్తున్న స్టాఫ్‌నర్సులు

చిన్నారులకు పూర్తిస్థాయిలో అందని పోషకాహారం

పర్యవేక్షణ మరచిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి

వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఉన్నారని, తమకేం సంబంధం లేదని చెప్పే సర్వజనాస్పత్రి అధికారులు ఎన్‌ఆర్‌సీలో ఉన్న డైటీషియన్‌ను మదర్‌ మిల్క్‌ బ్యాంకుకు డిప్యుటేషన్‌పై పంపారు. ప్రస్తుతం ఉన్న మరో డైటీషియన్‌ సెలవులో ఉన్నారు. అదేవిధంగా ఎన్‌ఆర్‌సీలో రెండు ఏసీలు పని చేయడం లేదు. ఫ్యాన్లు తిరగని పరిస్థితి. వంట వండే ఫ్లోర్‌లో పైకప్పు పెచ్చులూడి పడుతోంది. ఒక్కోసారి పైన ఉన్న బాత్‌రూంల నుంచి మురుగు కిందకు లీకవుతోందని సిబ్బంది చెబుతున్నారు. ఇన్ని అసౌకర్యాలున్నా.. అధికారులు అటువైపు తొంగి చూడడం లేదు.

సౌకర్యాలు పట్టించుకునే వారేరీ? 1
1/2

సౌకర్యాలు పట్టించుకునే వారేరీ?

సౌకర్యాలు పట్టించుకునే వారేరీ? 2
2/2

సౌకర్యాలు పట్టించుకునే వారేరీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement